ఇంటెల్‌ సహ వ్యవస్థాపకులు గోర్డాన్‌ మూర్‌ కన్నుమూత

ఇంటెల్‌ కార్ప్‌ సహ వ్యవస్థాపకులు గోర్డాన్‌ మూర్‌(94) కన్నుమూశారు. హవాయ్‌లోని ఆయన సొంత గృహంలో తుది శ్వాస విడిచినట్లు ఇంటెల్‌, గోర్డాన్‌ అండ్‌ బెట్టీ మూరే ఫౌండేషన్‌లు వెల్లడించాయి.

Published : 26 Mar 2023 01:42 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇంటెల్‌ కార్ప్‌ సహ వ్యవస్థాపకులు గోర్డాన్‌ మూర్‌(94) కన్నుమూశారు. హవాయ్‌లోని ఆయన సొంత గృహంలో తుది శ్వాస విడిచినట్లు ఇంటెల్‌, గోర్డాన్‌ అండ్‌ బెట్టీ మూరే ఫౌండేషన్‌లు వెల్లడించాయి. మూర్‌ రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. దీనికి మూడేళ్ల ముందు ఆయన మూర్స్‌ లాను కనిపెట్టారు. ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్ల సామర్థ్యం, సంక్లిష్టత ప్రతి ఏడాది రెట్టింపు అవుతాయని అప్పట్లో చిప్‌ల ఆధారంగా ఆయన అంచనా వేశారు. టెక్‌ పరిశ్రమ పురోగతి, ఆవిష్కరణలకు తర్వాత ఇది ప్రామాణికంగా మారింది.  2000వ సంవత్సంలో ఆయన తన భార్యతో కలిసి గోర్డాన్‌ అం్ బెట్టీ మూరే ఫౌండేషన్‌ స్థాపించి పర్యావరణ పరిరక్షణ, సైన్స్‌, రోగుల సేవ తదితర ప్రాజెక్టులకు 5.1 బిలియన్‌ డాలర్లను అందించారు.

ఇంటిగ్రేటెడ్‌+ఎలక్ట్రానిక్స్‌= ఇంటెల్‌

మూర్‌ 1929 జనవరి 3న శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి రసాయన శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 1954లో పీహెచ్‌డీ పట్టా పొందారు. జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీలో రీసెర్చర్‌గా పని చేశారు. ఫిజిక్స్‌లో నోబెల్‌ బహుమతి పొందిన విలియమ్‌ షాక్లే దగ్గరా పని చేశారు. షాక్లే సెమీ కండక్టర్‌ లేబొరేటరీ నుంచి బయటకొచ్చిన తర్వాత 1968లో మూరే, రాబర్ట్‌ నోసేలు కలిసి ఇంటెల్‌ను స్థాపించారు. ‘ఇంటిగ్రేటెడ్‌’, ‘ఎలక్ట్రానిక్స్‌’ పదాలను కలిపి ఇంటెల్‌గా కంపెనీకి పేరు పెట్టారు. 1975లో ఇంటెల్‌ సీఈఓగా మారారు. 1987 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. మరో 10 ఏళ్లు ఛైర్మన్‌గా కొనసాగారు. 1997 నుంచి 2006 వరకు గౌరవ ఛైర్మన్‌గా ఉన్నారు.

* అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌.డబ్ల్యూ. బుష్‌ నుంచి 1990లో నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ టెక్నాలజీని స్వీకరించారు. మరో అధ్యక్షుడు జార్జ్‌.డబ్ల్యూ.బుష్‌ నుంచి 2002లో ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ను పొందారు. ఆయనకు భార్య బెట్టీ, కుమారులు కెన్నెత్‌, స్టీవెన్‌, నలుగురు మనవళ్లు-మనవరాళ్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని