ఎయిర్‌బస్‌ నుంచి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు కాంట్రాక్టు

ఎయిర్‌బస్‌ నుంచి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు కార్గో విమానాల తలుపుల తయారీ కాంట్రాక్టు లభించింది. ఈ తలుపులను ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాల్లో వినియోగిస్తారు

Published : 30 Mar 2023 01:50 IST

కార్గో విమానాల తలుపుల తయారీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎయిర్‌బస్‌ నుంచి టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు కార్గో విమానాల తలుపుల తయారీ కాంట్రాక్టు లభించింది. ఈ తలుపులను ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానాల్లో వినియోగిస్తారు. ఈ తలుపులను హైదరాబాద్‌లోని యూనిట్లో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఉత్పత్తి చేస్తుంది. తయారీ ప్రక్రియలో రోబోటిక్స్‌, ఆటోమేషన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఒక్కో కార్గో తలుపుల సెట్‌లో రెండు కార్గో తలుపులు, ఒక బల్క్‌ కార్గో తలుపు ఉంటాయి. మేక్‌-ఇన్‌-ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇచ్చేవిధంగా టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు తయారీ కాంట్రాక్టులు అధికంగా ఇస్తున్నట్లు ఎయిర్‌బస్‌ ఇండియా ఎండీ రెమి మేలాండ్‌ వివరించారు. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తమకు ఎంతో నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌తో తమ బంధం రోజురోజుకూ బలపడుతోందని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఎండీ సుకరన్‌ సింగ్‌ తెలిపారు. ఎయిర్‌బస్‌ మనదేశంలోని 100 మంది విడిభాగాల సరఫరాదార్ల నుంచి ఏటా 735 మిలియన్‌ డాలర్ల విలువైన విమానాల విడిభాగాలు కొనుగోలు చేస్తోంది. ఎయిర్‌బస్‌ వాణిజ్య విమానాలు, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌లకు అవసరమైన ఎంతో కీలకమైన ఇంజినీరింగ్‌ విడిభాగాలను మన దేశంలోని వివిధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదే కాకుండా సీ295 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌(ఎఫ్‌ఏఎల్‌)ను టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌తో కలిసి గుజరాత్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేయటానికి ఎయిర్‌బస్‌ సన్నద్ధమవుతోంది. దీనివల్ల ఎయిర్‌బస్‌ ఆధారిత కార్యకలాపాలపై మన దేశంలో పనిచేస్తున్న 10,000 మంది ఉద్యోగుల సంఖ్య, వచ్చే పదేళ్లలో 25,000 మందికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని