ఓఎన్‌జీసీ నష్టం రూ.248 కోట్లు

జనవరి- మార్చి త్రైమాసికానికి ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) రూ.247.70 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

Published : 28 May 2023 01:36 IST

పన్నులకు కేటాయింపుల ప్రభావం

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికానికి ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) రూ.247.70 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాలంలో నికర లాభం రూ.8,859.54 కోట్లుగా నమోదైంది. పన్ను బకాయిల కేసులకు సంబంధించి రూ.12,100 కోట్ల వరకు కేటాయింపులు చేయాల్సి రావడమే సంస్థ నష్టాలను ప్రకటించేందుకు కారణమైంది. చమురు, సహజవాయువు ఉత్పత్తిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిన రాయల్టీకి సేవా పన్ను/ జీఎస్‌టీ చెల్లించాలంటూ సంబంధిత పన్నుల విభాగం ఓఎన్‌జీసీకి పన్ను నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను సవాలు చేస్తూ ఓఎన్‌జీసీ కోర్టులను ఆశ్రయించింది. ఈ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున.. ముందు జాగ్రత్తలో భాగంగా 2016 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలానికి కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించిన రాయల్టీపై సేవా పన్ను/ జీఎస్‌టీతో పాటు 2023 మార్చి 31 నాటికి వడ్డీతో కలిపి మొత్తంగా రూ.12,107 కోట్లు పక్కన పెట్టినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. దీనివల్లే 2022-23 ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికంలో లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది.

* జనవరి- మార్చిలో ఓఎన్‌జీసీ ఆదాయం 5.2 శాతం పెరిగి రూ.36,293 కోట్లకు చేరింది.

* పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంస్థ నికర లాభం రూ.40,306 కోట్ల నుంచి 3.7 శాతం తగ్గి రూ.38,829 కోట్లకు పరిమితమైంది.

* జనవరి- మార్చిలో ఒక బ్యారెల్‌ ముడి చమురు ఉత్పత్తిపై 77.12 డాలర్లను ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో ఆర్జించిన 94.98 డాలర్లతో పోలిస్తే తగ్గింది. 2022-23 మొత్తం మీద ఇది 91.90 డాలర్లుగా ఉండగా.. 2021-22లో 76.62 డాలర్లుగా నమోదైంది.

* రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై మొత్తంగా రూ.11.25 (225%) డివిడెండును కంపెనీ చెల్లించింది. ఇందుకోసం రూ.14,153 కోట్లను సంస్థ వెచ్చించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని