Tata Group: యూకేలో టాటా గ్రూప్‌ భారీ పెట్టుబడి.. సునాక్‌ హర్షం

Tata Group Investment UK: భారత్‌ వెలుపల టాటా గ్రూప్‌ భారీ పెట్టుబడి పెట్టింది. 4 బిలియన్‌ పౌండ్లతో గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.

Published : 19 Jul 2023 13:43 IST

లండన్‌: దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్‌ (Tata group) భారత్‌ వెలుపల భారీ పెట్టుబడి పెట్టనుంది. బ్రిటన్‌లో 4 బిలియన్‌ పౌండ్లతో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్యాటరీ ప్లాంట్‌ (గిగా ఫ్యాక్టరీ)ను (Gigafactory) ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్‌ నిర్ణయం పట్ల బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రశంసలు కురిపించారు. టాటా గ్రూప్‌ పెట్టుబడి ద్వారా వేలాది సంఖ్యలో ఉద్యోగ సృష్టి జరగబోతోందని చెప్పారు.

టాటా గ్రూప్‌నకు దేశీయంగా టాటా మోటార్స్‌తో పాటు యూకేలో లగ్జరీ కార్లు తయారు చేసే జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (JLR) ఉంది. ఈ నేపథ్యంలో 40GWh గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది. 2026లో కొత్త గిగా ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. ఒకసారి గిగా ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చాక జేఎల్‌ఆర్‌తో పాటు ఇతర కార్ల తయారీదారులకు ఉపయోగపడనుంది. సోమర్‌సెట్‌లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రిటన్‌లో రిషి పాపులారిటీ పడిపోతోంది..!

యూకేలో టాటా గ్రూప్‌ ఏర్పాటు చేయబోతున్న గిగా ఫ్యాక్టరీ.. తమ కార్ల తయారీ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని రిషి సునాక్‌ పేర్కొన్నారు. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నెట్‌ జీరో వైపు అడుగులకు ఇది దోహదం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉపకరిస్తుందని తెలిపారు. భారత్‌ వెలుపల టాటా గ్రూప్ తన తొలి గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు బ్రిటన్‌ను ఎంచుకోవడం గర్వంగా ఉందని సునాక్‌ పేర్కొన్నారు. తమ పెట్టుబడి ద్వారా ఆటోమొబైల్‌ రంగం.. ఎలక్ట్రిక్‌ వైపు మరలడానికి దోహదం చేస్తుందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్వహిస్తున్న టెక్నాలజీ, కన్జూమర్‌, హాస్పిటాలిటీ, స్టీల్‌, కెమికల్‌, ఆటోమోటివ్‌ వ్యాపారాలతో పాటు ఈ వ్యూహాత్మక పెట్టుబడి.. యూకే పట్ల తమ నిబద్ధతనను తెలియజేస్తోందని చంద్రశేఖరన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని