Mukesh Ambani: మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలోనూ ముకేశ్‌ సంచలనం?

జియోతో టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్‌ అంబానీ ఇపుడు జియో ఫైనాన్షియల్‌తో ఫండ్‌ పరిశ్రమలో ఇంకో సంచలనానికి తెర తీస్తున్నారా?

Updated : 30 Jul 2023 09:17 IST

తక్కువ ఖర్చుతో ఫండ్ల నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: జియోతో టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్‌ అంబానీ ఇపుడు జియో ఫైనాన్షియల్‌తో ఫండ్‌ పరిశ్రమలో ఇంకో సంచలనానికి తెర తీస్తున్నారా? దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో అనూహ్య మార్పులు రాబోతున్నాయా? ఇంత కాలం ఫండ్‌ నిర్వహణ ఛార్జీల పేరుతో మదుపర్లపై అధిక భారాన్ని మోపుతున్న విధానం ముగియనుందా? మ్యూచువల్‌ ఫండ్లలోకి అడుగుపెడుతున్న జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(జీఎఫ్‌ఎస్‌ఎల్‌) సృష్టించనున్న విప్లవం ఎలా ఉండబోతోంది.. ఇపుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ జూన్‌ 30 నాటికి రూ.44.4 లక్షల కోట్లకు చేరుకుంది. మ్యూచువల్‌ ఫండ్లలో ఇప్పటికీ సంస్థలు, కార్పొరేట్‌ల పెట్టుబడులే ఎక్కువ. రిటైల్‌ మదుపర్ల వాటా 2 శాతంలోపే. దీన్ని మంచి అవకాశంగా మార్చుకోవాలని ముకేశ్‌ అంబానీ భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఈటీఎఫ్‌లపైనే ప్రధానంగా దృష్టి

ఆస్తుల నిర్వహణలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బ్లాక్‌రాక్‌తో కలిసి మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమలోకి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(జేఎఫ్‌ఎస్‌ఎల్‌) అడుగుపెట్టబోతోంది. సంప్రదాయ ఫండ్లను తీసుకొచ్చే బదులు.. తక్కువ నిర్వహణ వ్యయాలతో, మదుపర్లకు ఆకర్షణీయంగా ఉండే ఈటీఎఫ్‌ పథకాలపైనే ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించనుందని చెబుతున్నారు. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల(ఈటీఎఫ్‌) వాటా 12% దరిదాపుల్లో ఉంది. అంటే, రూ.44.4 లక్షల కోట్లలో ఈ మొత్తం రూ.5 లక్షల కోట్లు మాత్రమే. ఇతర దేశాల్లో ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు ఎక్కువ. అంటే, ఈ విభాగంలో ఎంతో వృద్ధి అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడుగా డిజిటల్‌ ఫస్ట్‌ వేదిక ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సిద్ధం అవుతోంది.

సొంత వినియోగదారులను ఆకర్షిస్తే

రిలయన్స్‌ రిటైల్‌కు దేశ వ్యాప్తంగా 18,500 స్టోర్లు ఉన్నాయి. అదే సమయంలో జియో వినియోగదార్ల సంఖ్య దాదాపు 45 కోట్ల వరకు ఉంది. ఈ వినియోగదారులను తాను ఆవిష్కరించే మ్యూచువల్‌ ఫండ్లలోకి ఆకర్షించేందుకు జియో ఫైనాన్షియల్‌ ప్రయత్నిస్తుందని పరిశ్రమ  వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రస్తుతం 284 ఫండ్లు

దేశీయంగా ప్రస్తుతం 284 ఇండెక్స్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లు ఉన్నాయి. కానీ, వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెద్దగా లేదు. దీనికి ప్రధాన కారణం.. పంపిణీదారులకు వీటిపై పెద్దగా రాబడి ఉండదు. కాబట్టి, వీటిని అందించేందుకు అంతగా ఆసక్తి చూపరు. జియో ఫైనాన్షియల్‌ ఇప్పటికే  తనకున్న స్టోర్లలో ఈ ఫండ్లను విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. అదే సమయంలో బ్లాక్‌రాక్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం ‘అలాద్దీన్‌’ ద్వారా మదుపర్లను నేరుగా చేరుకునే అవకాశం కూడా ఉంది. ఈ సానుకూలతలతో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌పై పట్టు సాధించాలనేది జియో ఫైనాన్షియల్‌ ఆలోచనగా తెలుస్తోంది.

సవాళ్లూ ఉన్నాయ్‌

మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమ ప్రధానంగా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతుంది. మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్‌ల ప్రభావం మదుపర్లపై చాలా ఉంటుంది. వారు చెప్పిన ఫండ్లలో మదుపు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే సమయంలో సంప్రదాయ యాక్టివ్‌ ఫండ్లు అధిక రాబడిని అందిస్తాయనే నమ్మకమే ఎక్కువగా ఉంది. ఈటీఎఫ్‌లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి, కానీ, లాభాలు పెద్దగా కనిపించవని పెట్టుబడిదార్లు అంతగా మొగ్గు చూపరు. ఈ రెండు ప్రధాన సవాళ్లను జియో ఫైనాన్షియల్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు