రాబోతున్నాయా.. ముకేశ్‌ హోటళ్లు!

ముకేశ్‌ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా.. అది సంచలనమే. ఎందులోనైనా దూకుడు ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత.

Updated : 03 Sep 2023 08:14 IST

ముకేశ్‌ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా.. అది సంచలనమే. ఎందులోనైనా దూకుడు ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికే టెలికాం, రిటైల్‌లో దూసుకెళుతున్న ముకేశ్‌.. హరిత ఇంధనం, ఆర్థికంపైనా దృష్టి సారించారు. తాజాగా హోటళ్ల వ్యాపారంలోకీ అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఒక దశాబ్దం నుంచీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పలు రంగాల్లోకి అడుగుపెడుతోంది. తన ప్రధాన వ్యాపారమైన చమురు నుంచి టెలికాంలోకి.. ఆ తర్వాత రిటైల్‌లోకి.. ఇపుడు హరిత ఇంధనంలోకి వచ్చారు. తాజాగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో ఆర్థిక రంగంలోకీ ప్రవేశించారు. ఇవన్నీ భారీ స్థాయిలో, అంతకంటే భారీ పెట్టుబడులతో కూడినవే. ఈ వైవిధ్యీకరణ ఇంతటితో ఆగేలా లేదు. తాజాగా ద ఒబెరాయ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ (ఒబెరాయ్‌ గ్రూప్‌)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇందుకు నేపథ్యం. దీని కింద భారత్‌, బ్రిటన్‌లోని మూడు హోటళ్లను సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇందులో ముంబయిలో ప్రస్తుతం కడుతున్న అనంత్‌ విలాస్‌ హోటల్‌, బ్రిటన్‌లోని స్టోక్‌పార్క్‌, గుజరాత్‌లో ఇంకా పేరుపెట్టని హోటల్‌ ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి.

ఇది తొలిసారి కాదు..కానీ

ఏళ్ల కిందటే ఆతిథ్య రంగంలో అంబానీ పెట్టుబడులు పెట్టారు. గతేడాది మాండరిన్‌ ఓరియంటల్‌ హోటల్‌ (న్యూయార్క్‌)లో 73% వాటాను దాదాపు 100 మి. డాలర్లతో కొన్నారు. అంతక్రితం ఏడాది ప్రఖ్యాత కంట్రీ క్లబ్‌, లగ్జరీ గోల్ఫ్‌ రిసార్ట్‌ అయిన స్టోక్‌ పార్క్‌ను 57 మి. పౌండ్లతో సొంతం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే 2010లోనే ఒబెరాయ్‌ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టారు. అదే ఏడాది అంబానీకి చెందిన ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌.. ఈస్ట్‌ ఇండియా హోటల్స్‌ (ఈఐహెచ్‌)లో 14.12% వాటా కొనుగోలు చేసింది. ఆ సమయంలోనే కంపెనీలో తాము దీర్ఘకాల పెట్టుబడుదారు మాత్రమేనని.. నిర్వహణపై ఆసక్తి లేదని నీతా అంబానీ అన్నారు. అయితే ఇపుడుమాత్రం నిర్వహణలోకి వస్తున్నట్లు తాజా ఒప్పందం ద్వారా తెలుస్తోంది.

ఎవరికి పోటీ..

ఒక వేళ రిలయన్స్‌ ఆతిథ్య రంగంలో చురుగ్గా అడుగుపెడితే మాత్రం.. ఐటీసీ, టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌కు రిలయన్స్‌ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. న్యూయార్క్‌లోని ద మాండరిన్‌ ఓరియంటల్‌ టాటా గ్రూప్‌నకు చెందిన తాజ్‌ హోటల్‌లో భాగమైన ‘పియరీ’కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ప్రస్తుతానికైతే టాటా గ్రూప్‌, ఈఐహెచ్‌, ఐటీసీ.. భారత్‌లో అతిపెద్ద మూడు హోటల్‌ కంపెనీలు. ఒకవేళ అంబానీ ఇపుడు హోటల్‌ వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటే మాత్రం.. ఇదే సరైన సమయమని విశ్లేషకులు అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరుగుతున్న వేళ.. హోటల్‌ పరిశ్రమకు కొత్త హోటళ్లు నిర్మించి గిరాకీని అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కచ్చితంగా అవసరం. కరోనా ముందుతో పోలిస్తే.. ఇపుడు హోటల్‌ పరిశ్రమలో ఆపరేటింగ్‌ మార్జిన్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొత్త ప్రోపర్టీలపై భారీ మూలధన వ్యయాలు అవుతున్నాయని ఇక్రా ఇటీవలే తేల్చింది. హోటల్‌ పరిశ్రమలో పెట్టుబడులు పెంచి, గిరాకీని అందుకోవాల్సిన ఈ సమయంలో భారీ పెట్టుబడులతో అంబానీ ఈ రంగంలోకి అడుగుపెట్టడం సరైన వ్యూహమే అనిపించుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు