Mukesh Ambanis Children: ముకేశ్‌ పిల్లలకూ సున్నా వేతనమే!

ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు- ఆకాశ్‌, ఈశా, అనంత్‌లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారు.

Updated : 27 Sep 2023 08:08 IST

బోర్డు సమావేశాలకు హాజరైతే పారితోషికం, కమీషన్‌
డైరెక్టర్లుగా నియామకానికి వాటాదార్ల అనుమతి కోరుతూ రిలయన్స్‌ తీర్మానం

దిల్లీ: ముకేశ్‌ అంబానీ ముగ్గురు పిల్లలు- ఆకాశ్‌, ఈశా, అనంత్‌లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారు. బోర్డు సమావేశానికి హాజరైతే ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్‌ను మాత్రమే వాళ్లకు చెల్లిస్తారు. ముకేశ్‌ ముగ్గురు పిల్లలను కంపెనీ బోర్డులో చేర్చుకునేందుకు వాటాదార్ల అనుమతి కోరుతూ చేసిన తీర్మానంలో ఈ మేరకు పొందుపర్చినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. ఈ తీర్మానాన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వాటాదార్లకు రిలయన్స్‌ పంపించింది. కాగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన పిల్లలు కూడా వేతనం లేకుండా పనిచేస్తుండటం గమనార్హం.

అయితే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ముకేశ్‌ సమీప బంధువులు నికిల్‌, హితల్‌ మాత్రం జీతంతో పాటు భత్యాలు, కమీషన్లు సహా ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. మరోవైపు ముకేశ్‌ భార్య నీతా అంబానీ 2014లో కంపెనీ బోర్డు డైరెక్టరుగా నియమితులైన సమయంలో ఉన్న నియామక షరతులే ఆకాశ్‌, అనంత్‌, ఈశాలకూ వర్తించనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతా బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్‌ రుసుం కింద రూ.6 లక్షలు, కమీషన్‌ రూపంలో రూ.2 కోట్లు పొందినట్లు రిలయన్స్‌ వార్షిక నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2020-21లో ఆమెకు సిట్టింగ్‌ రుసుం రూ.8 లక్షలు కాగా.. రూ.1.65 కోట్ల కమీషన్‌ లభించింది. కాగా.. తన ముగ్గురు పిల్లలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో డైరెక్టర్లుగా చేయనున్నట్లు ఇటీవల జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) ముకేశ్‌  ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మరో ఐదేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్‌, సీఈఓగా కొనసాగనున్నట్లు కూడా ఆయన ఆ సమయంలో తెలిపారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్‌ బోర్డు డైరెక్టరుగా నీతా రాజీనామా చేశారు. అయితే బోర్డు సమావేశాలన్నింటికీ హాజరయ్యేలా ఆమెకు ‘శాశ్వత ఆహ్వానితురాలు’ హోదాను కల్పించారు.

కొత్త పదవీకాలంలోనూ సున్నా వేతనమే..

  • ముకేశ్‌ అంబానీ 1977లో రిలయన్స్‌లో బోర్డు డైరెక్టరుగా అడుగుపెట్టారు. 2002లో తండ్రి ధీరూభాయ్‌ అంబానీ మరణం అనంతరం.. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు అంటే 11 ఏళ్ల పాటు తన వార్షిక పారితోషికాన్ని రూ.15 కోట్లకే ముకేశ్‌ పరిమితం చేసుకున్నారు.
  • 2020-21లో కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం దృష్ట్యా తన కంపెనీ, వ్యాపారాలు తిరిగి పూర్తి సామర్థ్యంలో ఆదాయాలు ఆర్జించేంతవరకు వేతనం తీసుకోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2020-21 నుంచి వరుసగా మూడేళ్లుగా ఆయన ఎలాంటి వేతనాన్ని, లాభాలపై కమిషన్‌ను పొందడం లేదు.
  • ముకేశ్‌ వినతి మేరకు ఆయన కొత్త పదవీకాలమైన 2024 ఏప్రిల్‌ 19 నుంచి 2029 ఏప్రిల్‌ 18 వరకు కూడా ఎటువంటి వేతనం, కమిషన్‌ చెల్లించకూడదని బోర్డు సిఫారసు చేసింది.
  •  2022-23 వార్షిక నివేదిక ప్రకారం.. నిఖిల్‌, హితల్‌ పారితోషికం రూ.25 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.17.28 కోట్ల కమిషన్‌ కూడా కలిపి ఉంది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే కమిషన్‌ను ఆయన పొందారు.
  • ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.ఎం.ఎస్‌.ప్రసాద్‌ పారితోషికం రూపేణా (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కలిపి) రూ.13.50 కోట్లు అందుకున్నారు. 2021-22లో పొందిన రూ.11.89 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మరో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు కపిల్‌ పారితోషికం కూడా రూ.4.22 కోట్ల నుంచి రూ.4.40 కోట్లకు పెరిగింది. ఈయన ఐదేళ్ల పదవీకాలం 2023 మే 15తో ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బోర్డు డైరెక్టరు పదవీ నుంచి వైదొలిగారు.
  •  2023 జనవరిలో రిలయన్స్‌ బోర్డు డైరెక్టరుగా నియమితులైన కె.వి.కామత్‌కు రూ.3 లక్షల సిట్టింగ్‌ రుసుం, రూ.39 లక్షల కమిషన్‌ను చెల్లించారు.
  •  నీతా అంబానీతో పాటు బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా దీపక్‌ సి జైన్‌, రఘునాధ్‌ ఏ మషేల్కర్‌, అడిల్‌ జైనుల్‌భాయ్‌, రమిందర్‌ సింగ్‌ గుజ్రాల్‌, షుమీత్‌ బెనర్జీ, ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య, మాజీ సీవీసీ అయిన కేవీ చౌదరీ, సౌదీ దేశ వెల్త్‌ ఫండ్‌ నామినీ యాసిర్‌ ఓథ్‌మన్‌ హెచ్‌ అల్‌ రుమాయన్‌ ఉన్నారు. స్వత్రంత్ర డైరెక్టర్లందరికీ కమిషన్‌, సిట్టింగ్‌ రుసుము కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని