Mukesh Ambani: దేశీయ కుబేరుడు అంబానీ

దేశంలోని కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ (66) అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్‌ అదానీ సంపద విలువ తగ్గిపోగా, అంబానీ సంపద విలువ పెరగడమే  ఇందుకు కారణం.

Updated : 11 Oct 2023 08:20 IST

2% వృద్ధితో రూ.8.08 లక్షల కోట్లకు సంపద
అదానీ సంపదలో 57% క్షీణత
హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023

ముంబయి: దేశంలోని కుబేరుల్లో ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) (66) అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్‌ అదానీ సంపద విలువ తగ్గిపోగా, అంబానీ సంపద విలువ పెరగడమే  ఇందుకు కారణం. ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా, దేశంలోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారు.  మంగళవారం విడుదల చేసిన ‘360 వన్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2023’ ప్రకారం..

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెంది రూ.8.08 లక్షల కోట్లకు చేరుకుంది.
  • అదే సమయంలో అదానీ సంపద  57% క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక ఫలితంగా, అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విలువ పడిపోవడం ఇందుకు కారణమని హురున్‌ ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ పేర్కొన్నారు.
  • సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) అధిపతి సైరస్‌ పూనావాలా సంపద విలువ 36% పెరిగింది. ఆయన ఈ జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌నాడార్‌ కూడా సంపదను 23% పెంచుకుని నాలుగో స్థానంలో కొనసాగారు.
  • అగ్రగామి-10లోని గోపీచంద్‌ హిందూజా, దిలీప్‌ సంఘ్వి, ఎల్‌ఎన్‌ మిత్తల్‌, కుమార మంగళం బిర్లా, నీరజ్‌ బజాజ్‌లు తమ స్థానాలను మెరుగుపరచుకోగలిగారు.
  • డిమార్ట్‌ అధినేత దమానీ మాత్రం తన సంపదలో 18% క్షీణత కారణంగా మూడు స్థానాలు కోల్పోయి ఎనిమిదో స్థానంలో నిలిచారు.
  • జోహోకు చెందిన రాధా వెంబు ఈ జాబితాలో స్వయం కృషితో ఎదిగిన భారతీయ మహిళల్లో అగ్రస్థానాన్ని దక్కించుకోగలిగారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్‌ను అధిగమించారు.
  • జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా జాబితాలో అత్యంత పిన్నవయస్కుడి(20)గా నిలిచారు.
  • 94 ఏళ్ల మహేంద్ర రాఠీలాల్‌ మెహతా(ప్రెసిషన్‌ వైర్స్‌ ఇండియా) జాబితాలో తొలిసారిగా చేరారు.
  • ప్రతీ మూడు వారాలకు ఇద్దరు కొత్త బిలియనీర్లను భారత్‌ జత చేసుకుంది. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లున్నారు. 12 ఏళ్ల కిందటితో పోలిస్తే 4.4 రెట్లు పెరిగారు.
  • గతేడాదితో పోలిస్తే 51 మంది తమ సంపదను రెట్టింపు చేసుకున్నారు.
  • 328 మంది బిలియనీర్లతో ముంబయి నగరం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ(199), బెంగళూరు(100) నిలిచాయి. జాబితాలో ఎక్కువ మందితో టాప్‌-20లోకెక్కిన నగరాల్లో తొలిసారిగా తిరుప్పూర్‌ చేరింది.
  • కేదారా క్యాపిటల్‌కు చెందిన పరిశ్రమ దిగ్గజం మనీశ్‌ కేజ్రివాల్‌(రూ.3000 కోట్లు) ప్రైవేటు ఈక్విటీ(పీఈ) రంగం నుంచి కుబేరుల జాబితాలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి అయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి హురున్‌ జాబితాలో 105 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో అయిదుగురు మహిళలు కాగా, మొత్తం 105 మంది సంపద విలువ రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 33% పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్‌ మురళి రూ.55,700 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్‌ నుంచి అయిదుగురు ఈ జాబితాకెక్కారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాకెక్కిన వారిలో 83 శాతం మంది హైదరాబాద్‌లో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారని హురున్‌ తెలిపింది. 105 మందిలో 87 మంది హైదరాబాద్‌కు చెందిన వారే. ఈ రెండు రాష్ట్రాల నుంచి కొత్తగా 33 మంది ఈ జాబితాలోకి వచ్చారు. వీరి ద్వారా మొత్తం రూ.76000 కోట్లు జతయ్యాయి. జాబితాలో అత్యంత సంపద గల మహిళగా మహిమా దాట్ల (రూ.5700 కోట్లు) నిలిచారు. ఫార్మా రంగం నుంచి మొత్తం 33 మంది ఉన్నారు.

తొలిసారిగా జాబితాలోకి..

టాప్‌-20లోని మనోజ్‌ నంబూరు, ప్రవీణ్‌ కుమార్‌లతో పాటు జి రవీంద్ర రావు, కుటుంబం(యశోదా హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌-రూ.5400 కోట్లు), ఎన్‌ విశ్వేశ్వర రెడ్డి, కుటుంబం(షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌-రూ.4,600 కోట్లు), సజ్జ కిశోర్‌ బాబు, కుటుంబం(పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌-రూ.4300 కోట్లు) కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని