చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు

టెక్‌ ప్రపంచంలో ‘చాట్‌ జీపీటీ’ సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. అయితే దానిని రూపొందించిన శామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Published : 19 Nov 2023 02:34 IST

వెంటనే ఓపెన్‌ఏఐ  సహ-వ్యవస్థాపకుడి రాజీనామా

అమెరికా: టెక్‌ ప్రపంచంలో ‘చాట్‌ జీపీటీ’ సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. అయితే దానిని రూపొందించిన శామ్‌ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక మద్దతు గల ఓపెన్‌ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్‌మన్‌ తొలగింపు నిర్ణయం టెక్‌ వర్గాల్లో సంచలనంగా మారింది. మరో వైపు,  ఆల్ట్‌మన్‌ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే కంపెనీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ తన పదవికి రాజీనామా చేశారు. శామ్‌ ఆల్టమన్‌ను తొలగించిన కారణంగానే గ్రెగ్‌ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ‘గత ఎనిమిదేళ్ల నుంచి మేమంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల నేను గర్వంగా ఉన్నా. మేము ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్నాం. గొప్ప క్షణాలను ఆస్వాదించాం. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం. కానీ, ఈ రోజు చూసిన వార్తతో (శామ్‌ తొలగింపును ఉద్దేశిస్తూ) నేను కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నా’ అని గ్రెగ్‌ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఆల్ట్‌మన్‌ ఉద్వాసనకు కారణమేంటి?

  • బోర్డుతో విషయాలేవీ పంచుకోవడం లేదని, తాము తీసుకునే నిర్ణయాలను ఆల్ట్‌మన్‌ అడ్డుకుంటున్నాడన్నది బోర్డు ఆరోపణ. కానీ, ఆల్టమన్‌ తొలగింపునకు వేరే కారణాలున్నాయంటున్నాయి టెక్‌ వర్గాలు.
  • 2015లో ఓపెన్‌ ఏఐని నెలకొల్పినప్పుడు దీన్నొక లాభాపేక్షలేని సంస్థగా తీర్చిదిద్దాలని వ్యవస్థాపకులు అనుకున్నారు. ఆల్ట్‌మన్‌తో పాటు సుత్‌సేవర్‌, ఎలాన్‌ మస్క్‌, పలువురు వ్యవస్థాపకులుగా ఉన్నారు. మానవాళికి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐని అందించాలని అనుకున్నారు.
  • అయితే, 2019లో ఆల్ట్‌మన్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. కంపెనీ ఆశయాలకు గండికొడుతూ ఓపెన్‌ ఏఐని లాభాదాయకమైన ఓ వ్యాపారంగా మార్చాలని అనుకున్నాడు. ఏఐ వల్ల కలిగే దుష్పభ్రావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆల్ట్‌మన్‌ దూకుడుగా ముందుకెళ్లడమూ మరో కారణమని సిలికాన్‌ వ్యాలీ వర్గాలు పేర్కొంటున్నాయి.
  • చాట్‌జీపీటీ, ఇతర సర్వీసులకు సంబంధించిన భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు ముందుకెళ్లేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సొంత జీపీటీలను డెవలప్‌ చేసుకునేలా కొన్ని ప్లగ్‌ ఇన్‌లను చాట్‌జీపీటీలో ఓఎన్‌ఏఐ తీసుకొచ్చింది. దీంతో వెబ్‌సైట్‌కు యూజర్లు పోటెత్తడంతో కొన్ని గంటల పాటు చాట్‌జీపీటీ నిలిచిపోయింది.
  • ఓపెన్‌ ఏఐ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన కంపెనీ చీఫ్‌ సైంటిస్ట్‌ సుత్‌సేవర్‌కు, ఆల్టమన్‌ మధ్య విభేదాలు సైతం మరో కారణమని చెప్పుకొంటున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని