రోజంతా ఒడుదొడుకులే

మధ్యంతర బడ్జెట్‌ నేపథ్యంలో గురువారం స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Updated : 02 Feb 2024 05:50 IST

స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు

ధ్యంతర బడ్జెట్‌ నేపథ్యంలో గురువారం స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్‌లో భారీ ప్రకటనలు లేకపోవడంతో, సూచీల ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ముఖ్యంగా యంత్ర పరికరాలు, లోహ, స్థిరాస్తి షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. మార్చిలో వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 82.98 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. 

బడ్జెట్‌ ప్రసంగానికి ముందు

సెన్సెక్స్‌ ఉదయం 71,998.78 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం కొంత తడబడినా, బడ్జెట్‌ మీద సానుకూల అంచనాలతో లాభాల్లోకి వచ్చింది. బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్‌ 72,151.02 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది.

ప్రసంగం అనంతరం

బడ్జెట్‌ ప్రసంగం పూర్తయ్యాక.. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 71,574.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 106.81 పాయింట్ల నష్టంతో 71,645.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.25 పాయింట్లు తగ్గి 21,697.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,658.75- 21,832.95 పాయింట్ల మధ్య కదలాడింది.

  • 20 షేర్లకు నష్టాలు: సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 నష్టపోయాయి. అల్ట్రాటెక్‌ 2.42%, ఎల్‌ అండ్‌ టీ 2.38%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.03%, టైటన్‌ 1.93%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.75%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.70%, టెక్‌ మహీంద్రా 1.61%, నెస్లే 1.47%, విప్రో 1.39%, ఏషియన్‌ పెయింట్స్‌ 0.99% డీలాపడ్డాయి. మారుతీ 4.40%, పవర్‌గ్రిడ్‌ 2.49%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.56%, ఎన్‌టీపీసీ 1.32%, ఎస్‌బీఐ 1.12% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం 1.55%, యంత్ర పరికరాలు    1.12%, స్థిరాస్తి 1.05%, లోహ 0.99%, కమొడిటీస్‌ 0.91%, పరిశ్రమలు 0.91% పెరిగాయి. ఇంధన, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆర్థిక సేవలు, యుటిలిటీస్‌, సేవలు నీరసపడ్డాయి. బీఎస్‌ఈలో 2081 షేర్లు నష్టపోగా, 1774 షేర్లు రాణించాయి. 88 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
  • రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించడంతో.. కేపీఐ గ్రీన్‌ ఎనర్జీ 9.48%, వెబ్‌సోల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ 4.99%, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ 1.07% చొప్పున లాభాలు నమోదుచేశాయి.
  • వచ్చే అయిదేళ్లలో గ్రామీణ పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లను నిర్మిస్తామన్న ప్రకటన నేపథ్యంలో.. ప్రభుత్వరంగ హడ్కో షేరు 19.99 శాతం దూసుకెళ్లి అప్పర్‌ సర్క్యూట్‌ తాకి రూ.206.80 వద్ద ముగిసింది. ఎన్‌బీసీసీ 12.01% లాభంతో రూ.145 దగ్గర స్థిరపడింది.
  • బడ్జెట్‌ ప్రకటనల నేపథ్యంలో విద్యుత్తు వాహనాల తయారీ కంపెనీల షేర్లు మెరిశాయి. జేబీఎం ఆటో 2.48%, గ్రీవ్స్‌ కాటన్‌ 0.95% లాభపడ్డాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ షేరు ఇంట్రాడేలో రూ.1,849.25 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకినా, చివరకు 0.69% నష్టంతో రూ.1729 వద్ద స్థిరపడింది.
  • రైల్వేలపై బడ్జెట్‌ ప్రతిపాదనలతో తొలుత ఆ కంపెనీల షేర్లు లాభపడినా, చివరకు నష్టపోయాయి. రైల్‌టెల్‌ 3.84%, ఇర్కాన్‌ 3.69%, ఆర్‌వీఎన్‌ఎల్‌ 3.49%, ఐఆర్‌ఎఫ్‌సీ 2.85%, జూపిటర్‌ వ్యాగన్స్‌ 1.93%, ఐఆర్‌సీటీసీ 1.57%, టెక్స్‌మాకో రైల్‌ 0.82%, టిటాగఢ్‌ రైల్‌ 0.55% మేర నష్టపోయాయి.
  • బీఎల్‌ఎస్‌ ఇ-సర్వీసెస్‌ ఐపీఓకు చివరిరోజు ముగిసేసరికి 162.48 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,37,02,904 షేర్లను ఆఫర్‌ చేస్తుండగా, 2,22,63,80,472 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐల నుంచి 300.14 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 237 రెట్లు, క్యూఐబీ విభాగంలో 123.30 రెట్ల చొప్పున స్పందన నమోదైంది.
    నేటి బోర్డు సమావేశాలు: టాటా మోటార్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, టొరెంట్‌ ఫార్మా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, మెడ్‌ప్లస్‌, కావేరీ సీడ్‌ కంపెనీ, ఎంఓఐఎల్‌, దాల్మియా భారత్‌ షుగర్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌, ఎన్‌ఐఐటీ, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్‌, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని