Paytm: పేటీఎం బ్యాంక్‌పై ఆంక్షలను సమీక్షించట్లేదు

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)పై విధించిన ఆంక్షల మీద, పునఃసమీక్ష జరుపుతున్నామంటూ వస్తున్న ఊహాగానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొట్టిపారేసింది.

Updated : 13 Feb 2024 11:47 IST

సమగ్ర మదింపు తర్వాతే విధించాం: ఆర్‌బీఐ

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (పీపీబీఎల్‌)పై విధించిన ఆంక్షల మీద, పునఃసమీక్ష జరుపుతున్నామంటూ వస్తున్న ఊహాగానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొట్టిపారేసింది. సమగ్ర పరిశీలన అనంతరమే పీపీబీఎల్‌పై ఆంక్షలు విధించామని స్పష్టం చేసింది. ఈనెల 29 తరవాత డిపాజిట్ల స్వీకరణ, వినియోగదార్ల ఖాతాలు, వ్యాలెట్‌లు, ఫాస్టాగ్‌లలో టాప్‌అప్‌లను ఆపేయాలంటూ పీపీబీఎల్‌కు జనవరి 31న ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘పీపీబీఎల్‌ మీద విధించిన ఆంక్షలపై ఎటువంటి సమీక్ష చేయట్లేదు. మా నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామేమోననే భావనలో ఎవరైనా ఉంటే.. అలాంటిదేమీ ఉండదని మాత్రం కచ్చితంగా  చెబుతున్నాన’ని ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్ల 606వ సమావేశానంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఆర్‌బీఐ నియంత్రణలోని ఏ సంస్థపైనా అయినా.. పూర్తి మదింపు అనంతరమే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఫిన్‌టెక్‌ రంగ వృద్ధికి ఆర్‌బీఐ సహకారం ఎప్పటికీ ఉంటుందని పునరుద్ఘాటిస్తూ.. వినియోగదార్ల ప్రయోజనాల పరిరక్షణ, ఆర్థిక సుస్థిరతకు ఆర్‌బీఐ కట్టుబడి ఉంటుందని వివరించారు. పేటీఎం (Paytm) వ్యవహారంలో వినియోగదార్లు, డిపాజిటర్ల సందేహాలను నివృత్తి చేసే నిమిత్తం ఈ వారంలోనే ఎఫ్‌ఏక్యూలను (సందేహాలు- సమాధానాలు) ఆర్‌బీఐ విడుదల చేసే అవకాశం  ఉందని పేర్కొన్నారు.

డైరెక్టరు రాజీనామా నిజమే

పీపీబీఎల్‌లో స్వతంత్ర డైరెక్టరు రాజీనామా చేశారని కంపెనీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఫిబ్రవరి 1న పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ బోర్డు నుంచి మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారని ఎక్స్ఛేంజీలకు తెలిపింది.


రూ.2,000 కోట్లు వాడుతుందా?

2021 నవంబరులో తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.2,000 కోట్లను చిన్న కంపెనీల కొనుగోలు, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడుల కోసం పేటీఎం పక్కకుపెట్టింది. 2023 డిసెంబరు 31 వరకు చూస్తే.. ఈ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా పేటీఎం ఖర్చు పెట్టలేదు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలతో ఏర్పడిన సంక్షోభ స్థితి నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు ఈ నిధులను పేటీఎం వాడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన వెంటనే.. ఇ-కామర్స్‌, పేమెంట్స్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో సంస్థల కొనుగోలుకు ఉన్న అవకాశాలను అన్వేషించే బాధ్యతలు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులకు పేటీఎం అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇ కామర్స్‌ సంస్థ బిట్సిలా కొనుగోలు నిమిత్తం పేటీఎం చర్చలు జరుపుతోందనీ తెలిపింది. కీలకమైన చెల్లింపుల వ్యాపారాన్ని కాపాడుకునేందుకు పేటీఎం రానున్న రోజుల్లో ఇలాంటి కొనుగోళ్లు మరిన్ని చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. తమ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామనే సానుకూల సంకేతాన్ని ఈ కొనుగోళ్ల ద్వారా మార్కెట్‌కు ఇవ్వాలన్నది పేటీఎం ఉద్దేశంగా చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని