ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు

కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్‌ లేఖ పంపినట్లు తెలుస్తోంది.

Published : 19 Mar 2024 01:29 IST

ఉద్యోగులకు డెల్‌ స్పష్టీకరణ

కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్‌ లేఖ పంపినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అనుమతించిన ఇంటి నుంచి పని హైబ్రిడ్‌ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే (ఆర్‌టీఓ) విధానాన్ని ఆ సంస్థ అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇంటి నుంచి పనిని కొనసాగించే పక్షంలో, పదోన్నతులకు ఆయా ఉద్యోగుల పేర్లను పరిశీలించబోమని తేల్చి చెప్పింది.  అయితే కరోనా పరిణామాలకు దశాబ్దం ముందు నుంచే హైబ్రిడ్‌ పని (వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు కార్యాలయాలకు రావడం) విధానాన్ని సంస్థ అనుమతిస్తోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్‌ డెల్‌ దీనికి ప్రోత్సహించారు కూడా. ‘ఉద్యోగులు ఆఫీసుకు రావాలంటూ పట్టుపడుతున్న’ కంపెనీలనూ అప్పట్లో మైఖేల్‌ తప్పుబట్టారు. ఇపుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తన ఉద్యోగులకు పంపిన లేఖలోఉద్యోగులను హైబ్రిడ్‌ లేదా రిమోట్‌ వర్కర్లుగా సంస్థ వర్గీకరించింది. హైబ్రిడ్‌ సిబ్బంది వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకు రావాలి. పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వారికి చాలా పరిమితులు ఉంటాయని కంపెనీ పంపిన లేఖను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. పదోన్నతి లేదా కంపెనీలో ఇతర జాబ్‌ రోల్‌లకు ఇంటి నుంచి పనిచేసే వారి పేర్లను పరిశీలించరని తెలిపింది. ఈ నిర్ణయంపై చాలా మంది ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నా.. కొత్త నిబంధనకే కట్టుబడి ఉండాలని డెల్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని