యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్‌

దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51%  పెరిగాయి.

Published : 30 Apr 2024 02:18 IST

సీఎంఎస్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51%  పెరిగాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు లాజిస్టిక్స్‌, సాంకేతిక సేవలను అందించే సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘అన్‌ఫోల్డింగ్‌ ఇండియాస్‌ కన్సంప్షన్‌ స్టోరీ’ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు రూ.1.43 కోట్లకు చేరాయి. 2022-23లో ఇది రూ.1.35 కోట్లుగా ఉంది. యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నా, ప్రజలు నగదు రూపంలో ఖర్చు చేసేందుకు, నగదును అట్టేపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారనేందుకు ఇది నిదర్శనమని సంస్థ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన చూసినా, 2022-23 కంటే గత ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు 10 నెలల కాలంలో సగటున 7.23% కంటే అధికంగా ఉన్నాయి.

  •  మెట్రోల్లో నగదు ఉపసంహరణ సగటున 10.37% పెరిగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 3.94%, నగరాల్లో 3.73% పెరిగాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో నగదు ఉపసంహరణలు అధికంగా జరిగాయి.
  •  ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు 49% మెట్రోల్లో, నగరాల్లో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 51% ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు 64%  మెట్రోలు, నగరాల్లోనే ఉన్నాయి.
  • నెలవారీగా చూస్తే కర్ణాటకలో అత్యధిక సగటు ఉపసంహరణ రూ.1.83 కోట్లు, దిల్లీలో 1.82 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో రూ.1.82 కోట్లుగా ఉన్నాయి.

వినోదం కోసం అధికంగా వెచ్చిస్తున్నారు: దేశ ప్రజలు మీడియా, వినోద ప్రసారాల వీక్షణకు అధికంగా ఖర్చు చేస్తున్నారని సీఎంఎస్‌ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మీడియా, వినోద రంగం 29.3% వృద్ధి చెందింది. వినోద రంగంలో గత రెండేళ్ల కాలంలో సగటు వ్యయం 100% పెరిగిందని వెల్లడించింది. ఓటీటీలకు చెల్లింపులతో పాటు థియేటర్లకూ అధికులు తరలి వెళ్తుండటంతోనే, వ్యయంలో ఇంతటి వృద్ధి నమోదైందని పేర్కొంది.

  • విలాసవంత వస్తువుల కొనుగోలు కోసమూ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆహారం, దుస్తులు, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలకు మించి ఇతర వాటిపై దృష్టి సారిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో 16.76% వృద్ధి కనిపించింది. 2022-23లో ఇది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు పెరిగినదాన్ని చూస్తే ఈ రంగం కోలుకున్నట్లు చెప్పొచ్చు.
  • గత ఆర్థిక సంవత్సరంలో విమానయాన రంగంలో సగటు వ్యయం 6.36% పెరిగింది. రైల్వే ప్రయాణాల్లో 8.16% వార్షిక వృద్ధి నమోదైంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో విమానయాన రంగం సగటున 27.42%, రైల్వే ప్రయాణాల్లో 56.35% చొప్పున వృద్ధి కనిపించింది.
  • ఇ-కామర్స్‌ రంగంలో 2022-23లో 25.44% క్షీణత కనిపించింది. 2023-24లో ఈ క్షీణత 14.61 శాతంగా నమోదయ్యింది. గతంతో పోలిస్తే వృద్ధి రేటు కాస్త పెరిగినప్పటికీ, భారతీయుల కొనుగోలు పద్ధతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పొచ్చు. క్యాష్‌ ఆన్‌ డెలివరీ పద్ధతిని అధికులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రెండు, మూడో అంచె పట్టణాల వారు ఇదే విధానంలో ఇకామర్స్‌ కొనుగోళ్లు జరుపుతున్నారని నివేదిక తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని