Income Tax: హెచ్ఆర్ఏ అంటే ఏంటి?ఎంత మొత్తం క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?

ఉద్యోగులు హెచ్ఆర్ఏపై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే జీతం నుంచి సెక్ష‌న్ 10 (13ఏ) కింద హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

Published : 12 Jul 2022 11:48 IST

ఉద్యోగం చేస్తూ జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ప్ర‌తీ ఒక్క‌రికీ హెచ్ఆర్ఏ గురించి తెలిసే ఉంటుంది. ఉద్యోగి జీతం మొత్తంలో ప్రాథ‌మిక వేత‌నంతో పాటు కొన్ని అల‌వెన్సులు మిళితం అయ్యి ఉంటాయి. అందులో హెచ్ఆర్ఏ ఒక‌టి. హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భ‌త్యం (అల‌వెన్స్‌). ఉద్యోగి నివ‌సించేందుకు కావాల్సిన వ‌స‌తి కోసం కొంత మొత్తాన్ని మూల వేతనం(బేసిక్) తో క‌లిపి సంస్థ‌ చెల్లిస్తుంది. శాల‌రీ స్లిప్‌ను ప‌రిశీలిస్తే మీ జీతంలో హెచ్ఆర్ఏ ఎంత ఉందో తెలుస్తుంది. ఉద్యోగులు హెచ్ఆర్ఏపై ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే జీతం నుంచి సెక్ష‌న్ 10 (13ఏ) కింద హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. 

హెచ్ఆర్ఏపై ప‌న్ను మిన‌హాయింపును ఎలా లెక్కించాలి?
ఇందుకోసం ముఖ్యంగా నాలుగు అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. 
1. ఉద్యోగి జీతం 
2. పొందిన హెచ్ఆర్ఏ
3. చెల్లిస్తున్న ఇంటి అద్దె
4. నివ‌సిస్తున్న ప్రాంతం (మెట్రో, నాన్-మెట్రో, రూర‌ల్‌). 

హెచ్ఆర్ఏ లెక్కించినప్పుడు ఈ కింది మూడు ఆప్ష‌న్ల‌లో ఏది త‌క్కువ‌గా ఉంటుందో, అది హెచ్ఆర్ఏ నుంచి మినహాయించవచ్చు. 

1. సంస్థ అందించిన మొత్తం హెచ్ఆర్ఏ
2. మెట్రో న‌గరాల‌లో నివ‌సిస్తున్న వారు - (బేసిక్ శాలరీ + డీఏ) లో 50 శాతం, మెట్రోయేత‌ర న‌గ‌రాల‌లో నివ‌సిస్తున్న వారు - (బేసిక్ శాలరీ + డీఏ) లో 40 శాతం,
3. మీరు చెల్లిస్తున్న అద్దె నుంచి (బేసిక్ శాల‌రీ + డీఏ) లో 10 శాతం తీసివేయాలి

ఈ మూడింటిలో ఏది త‌క్కువైతే ఆ మొత్తాన్ని మిన‌హాయించ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, ర‌వి హైద‌రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అత‌ను ప్ర‌తీ నెల రూ. 15 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. అత‌ని బేసిక్ శాల‌రీ నెల‌కు రూ. 22వేలు. డీఏ రూ. 2 వేలు. హెచ్ఆర్ఏ నెల‌కు రూ. 10 వేలు. అనుకుందాం. 

ఇప్ప‌డు అత‌నికి హెచ్ఆర్ఏ మిన‌హాయింపు ఎంత వ‌ర‌కు ల‌భిస్తుందో చూద్దాం. 
1. వార్షికంగా ర‌వి సంస్థ నుంచి తీసుకునే హౌస్ రెంట్ అల‌వెన్స్ = రూ. 1,20,000 (రూ. 10,000*12)
2. (బేసిక్ శాల‌రీ + డీఏ) లో 40 శాతం  = రూ. 1,15,200 (40%*(రూ. 22,000 + రూ. 2,000) * 12)
అత‌ను హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్నాడు. అది నాన్ - మెట్రో న‌గ‌రం కాబ‌ట్టి, 40 శాతం వ‌ర‌కు లెక్కించడం జ‌రిగింది.
3. చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం శాల‌రీ (బేసిక్ + డీఏ) తీసివేస్తే = రూ. 1,51,200 ( (రూ. 15,000*12) - 10% (రూ. 22,000 + రూ. 2,000) * 12))

ఈ మూడింటిలో రూ. 1,15,200 త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి అంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు. అంటే మొత్తం సంస్థ చెల్లించే హెచ్ఆర్ఏ రూ. 1,20,000- రూ. 1,15,200 = రూ. 4,800  ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. 

హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేందుకు ఇవ్వాల్సిన ప‌త్రాలు..
*
పాన్ కార్డు. ఒక‌వేళ అద్దె నిమిత్తం వార్షికంగా రూ. 1 ల‌క్ష కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తున్న‌ప్పుడు ఇంటి య‌జ‌మాని పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే హెచ్ఆర్ఏ మిన‌హాయింపు కోల్పోతారు. ఒక‌వేళ ఇంటి య‌జ‌మానికి పాన్ కార్డు లేక‌పోతే ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ ఇంటి యాజ‌మాని ఇచ్చిన సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌ను స‌మ‌ర్పించాలి. 
* అద్దె చెల్లించిన ర‌శీదులు
* అద్దె ఒప్పంద ప్ర‌తం ఫోటో కాపీ (అవ‌స‌ర‌మైతే) ఇవ్వాలి. 

 ఇత‌ర ముఖ్య విష‌యాలు..
*
ఒక‌వేళ‌ మీ ఇంటి య‌జ‌మాని ఎన్ఆర్ఐ అయితే అద్దె చెల్లించే ముందు 30 శాతం మొత్తాన్ని టీడీఎస్ కోసం త‌గ్గించాల్సి ఉంటుంది.
* ఒకవేళ మీరు మీ త‌ల్లిదండ్రుల వ‌ద్ద నివ‌సిస్తూ.. మీ త‌ల్లి లేదా తండ్రి ఇంటి య‌జ‌మాని అయితే వారి వ‌ద్ద అద్దెకు ఉంటున్న‌ట్లు చూపించ‌వ‌చ్చు. ర‌వి త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉంటున్నాడు. కంపెనీ ఇచ్చే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవ‌డం కోసం.. ర‌వి త‌న త‌ల్లిదండ్రుల ఇంట్లో అద్దెకు ఉంటున్న‌ట్లు అద్దె అగ్రిమెంట్ చేసుకుని..త‌గిన మొత్తాన్ని ప్ర‌తీ నెల వారి ఖాతాకు బ‌దిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది వారి త‌ల్లిదండ్రుల‌కు అద్దె ద్వారా వ‌చ్చిన ఆదాయం అవుతుంది. కాబ‌ట్టి వారు వారి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌లో ఈ ఆదాయం చూపించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ర‌వి త‌ల్లిదండ్రుల ఆదాయం ప‌న్ను ప‌రిధిలోనే ఉంటే దీన్ని కుటుంబ ఆదాయంగా చూపించి ప‌న్ను త‌గ్గించుకోవ‌చ్చు. 
* ఇక్క‌డ ఒక ముఖ్య విష‌యం ఏమిటంటే త‌ల్లిదండ్ర‌ల వ‌ద్ద అద్దెకు ఉంటున్న‌ట్లు చూపించ‌వ‌చ్చు. కానీ, జీవిత భాగ‌స్వామి వ‌ద్ద చూపించ‌కూడ‌దు. ఇందుకు ఆదాయ‌ ప‌న్ను నియ‌మాలు అంగీక‌రించ‌వు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు