ఆదాయపు పన్నురిఫండు రావాలంటే

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ. ఇప్పటికే రిటర్నులు సమర్పించిన వారికి ఆదాయపు పన్ను విభాగం రిఫండులనూ అందించింది.

Updated : 21 Jul 2023 00:40 IST

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ. ఇప్పటికే రిటర్నులు సమర్పించిన వారికి ఆదాయపు పన్ను విభాగం రిఫండులనూ అందించింది. చాలామంది చెల్లించిన పన్ను మొత్తం రిఫండు రూపంలో అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మోసపూరిత మినహాయింపులను క్లెయిం చేసుకుంటున్నారు. ఐటీ విభాగం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు సరికొత్త సాంకేతికతలను వినియోగిస్తోంది. కానీ, కొన్నిసార్లు మనం చెల్లించాల్సిన పన్నుకు మించి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాస్తవంగానే పన్ను  రిఫండు అందుతుంది.

ఆర్జించిన ఆదాయం, ఇతర వివరాల ప్రకారం సరైన ఐటీఆర్‌ ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు రిఫండు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే.. ముందుగా ఫారం 26ఏఎస్‌తోపాటు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)ను ఒకసారి పరిశీలించండి. ఇందులో మీ ఆదాయ  వివరాలతోపాటు, చెల్లించిన టీడీఎస్‌, టీసీఎస్‌లాంటి వివరాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మీ దగ్గర వసూలు చేసిన పన్ను ఆదాయపు పన్ను శాఖకు జమ కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫారం 26ఏఎస్‌లో అది కనిపించదు.
పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్నప్పుడు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 87ఏ కింద రూ.12,500 వరకూ పన్ను రిబేటు లభిస్తుంది. చాలామంది ఫారం 26ఏఎస్‌లో ఇది కనిపించే అవకాశం ఉంటుంది.

* ఆదాయపు పన్ను రిటర్నులను గడువుకు ముందే దాఖలు చేయాలి. జులై 31 దాటితే అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. తొందరగా దాఖలు చేసినప్పుడు ప్రాసెసింగ్‌ వేగంగా పూర్తయి, రిఫండు వచ్చే అవకాశం ఉంటుంది.

* కొత్త, పాత పన్నుల విధానం ప్రకారం పన్ను రిటర్నులను దాఖలు చేయొచ్చు. అవసరమైతే ఒకసారి పరిశీలించి, ఎందులో ఎక్కువ రిఫండు వస్తుందో చూసుకోండి. దాని ప్రకారం రిటర్నులు దాఖలు చేయొచ్చు. అన్ని సెక్షన్ల కిందా మినహాయింపులు క్లెయిం చేసుకోలేకపోయిన వారు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు.

* ఫారం-16లో లేని మినహాయింపులను మీరు క్లెయిం చేసుకోవాలంటే, దానికి తగిన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సెక్షన్‌ 80సీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ మీ పాన్‌, ఆధార్‌తో చేసిన కేవైసీతోనే ఉంటాయి. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియమూ మీ పాన్‌ ఆధారంగా సులభంగానే ఐటీ విభాగానికి తెలిసిపోతుంది.
అనుమతించిన మినహాయింపులను క్లెయిం చేసుకున్న తర్వాత వాస్తవంగా ఎంత రిఫండు వస్తుందో చూసుకోండి. అంతకు మించి తీసుకోవాలనే ప్రయత్నం కొన్నిసార్లు ఇబ్బందులను తెచ్చిపెడుతుందని మర్చిపోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని