మీ ద్విచక్ర వాహనానికి బీమా ఉందా?

మోటారు వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రమాదాలూ అధికంగానే నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో బండి దెబ్బతినడం, వాహనదారుడికి గాయాలు కావడం, కొన్ని సందర్భాల్లో మరణాలూ సంభవిస్తుంటాయి. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Updated : 18 Aug 2023 09:57 IST

మోటారు వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రమాదాలూ అధికంగానే నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో బండి దెబ్బతినడం, వాహనదారుడికి గాయాలు కావడం, కొన్ని సందర్భాల్లో మరణాలూ సంభవిస్తుంటాయి. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. దీంతోపాటు అనుకోని ప్రమాదంలో ఆర్థిక భారం లేకుండా ఉండేందుకు మోటార్‌ వాహన బీమా ఉండాలి.

భారతీయ మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికీ బీమా ఉండాల్సిందే. కనీస థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. ఇది లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించడం కుదరదు. లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌, బీమా, అవసరమైన ఇతర పత్రాలు లేకుండా వాహనం తీయడం సరికాదు. 

  •   ద్విచక్ర వాహనం ద్వారా మూడో పక్షానికి (థర్డ్‌ పార్టీ అంటే వాహనం, వాహనాన్ని నడిపే వ్యక్తికి కాకుండా) ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు పరిహారం ఇచ్చేది థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌. దీన్ని ‘లయబిలిటీ ఓన్లీ’ పాలసీగానూ పిలుస్తారు.
  • విస్తృత బీమా ప్రయోజనాలు కల్పించేది సమగ్ర ద్విచక్ర వాహన బీమా. ప్రమాదం, దొంగతనం,  వరదలు, అగ్ని ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు తదితర వాటి వల్ల నష్టానికి పరిహారం ఇవ్వడంతోపాటు, థర్డ్‌ పార్టీకి వాటిల్లిన నష్టాన్నీ ఈ బీమా భర్తీ చేస్తుంది.  
  • సమగ్ర బీమా పాలసీకి కొన్ని అనుబంధ పాలసీలనూ జోడించుకునే అవకాశం ఉంది.
  •  సున్నా తరుగుదల: ద్విచక్ర వాహన బీమా పాలసీలో ముఖ్యమైన యాడ్‌-ఆన్‌ (అనుబంధ) పాలసీలలో ఈ కవర్‌ ఒకటి. ప్రమాదంలో దెబ్బతిన్న భాగాల విలువకు సమానమైన మొత్తాన్ని అందుకుంటారు. లేకపోతే ప్రతి భాగంపై తరుగుదల లెక్కించి, ఆ మేరకే బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని చేతి నుంచి భరించాల్సి వస్తుంది.
  •  ఇంజిన్‌కు రక్షణ: ఇంజిన్‌ అంతర్గత భాగాలు దెబ్బతిన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. వరదల్లో వాహనం చిక్కుకున్నప్పుడు ఇంజిన్‌ పాడవుతుంది. ఇలాంటప్పుడు ఈ అనుబంధ పాలసీ ఉపయోగపడుతుంది. టైర్లకు నష్టం వాటిల్లినప్పుడు టైర్‌ ప్రొటెక్టర్‌ పాలసీ సైతం అందుబాటులో ఉంది.  
  •  రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌: ప్రమాదం లేదా వాహనం చెడిపోవడం, ఇంధనం ఖాళీ అవడం వల్ల ద్విచక్ర వాహనం రోడ్డుపైనే ఆగిపోతుంది. ఇలాంటప్పుడు అవసరమైన సేవలను అందించేందుకు ఈ రైడర్‌ తోడ్పడుతుంది.
  •  వినియోగ వస్తువుల ఖర్చులు: మీ మోటార్‌సైకిల్‌ పాడైన సందర్భంలో నట్లు లేదా బోల్ట్‌లు, ఇంజిన్‌ ఆయిల్‌, గేర్‌బాక్స్‌, బ్రేక్‌ ఆయిల్‌ వంటి అనేక వినియోగ వస్తువుల కోసం చేసిన ఖర్చును వినియోగ ఖర్చుల కవర్‌ ద్వారా తిరిగి పొందవచ్చు.
  • ఏదైనా పాలసీ సంవత్సరంలో మీరు క్లెయిం చేయకుంటే.. పునరద్ధరణ సమయంలో గణనీయమైన తగ్గింపు లభిస్తుంది. అంటే ప్రీమియం మొత్తంపై నో క్లెయిం బోనస్‌ రూపంలో ఇది పొందవచ్చు.

    మనం ఎంత సురక్షితంగా వాహనాన్ని నడిపినా.. అనుకోకుండా ప్రమాదాల బారిన పడే సందర్భాలుంటాయి. ఇలాంటి వాటికి ఆర్థికంగా సన్నద్ధం కావడం ముఖ్యం. అదే సమయంలో చట్టపరమైన బాధ్యతను నెరవేర్చడంలోనూ బీమా పాలసీ తోడ్పడుతుంది. కాబట్టి, మీ వాహనానికి ఎల్లప్పుడూ సమగ్ర వాహన బీమా పాలసీ ఉండేలా చూసుకోండి.

 నితిన్‌ డియో, చీఫ్‌- అండర్‌ రైటింగ్‌, క్లెయిమ్‌, రీఇన్సూరెన్స్‌, జునో జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని