Higher Pension from EPFO: అధిక పింఛనుకు రవుర్కెలా పద్ధతే

ప్రైవేటు రంగంలో అధిక పింఛనుకు అర్హులైన వేతన జీవులకు దామాషా పద్ధతిలో పార్టు-1, పార్టు-2 విధానం కింద పింఛను లెక్కించి ఖరారు చేయాలని తాజాగా ఈపీఎఫ్‌వో నిర్ణయించింది.

Updated : 11 Sep 2023 20:10 IST

రెండు పార్టులుగా లెక్కింపు
ప్రాంతీయ కార్యాలయాలకు సూచించిన ఈపీఎఫ్‌వో
ఆశావహుల అంచనాలపై దెబ్బ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు రంగంలో అధిక పింఛనుకు అర్హులైన వేతన జీవులకు దామాషా పద్ధతిలో పార్టు-1, పార్టు-2 విధానం కింద పింఛను లెక్కించి ఖరారు చేయాలని తాజాగా ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. ఇది ఆశావహుల అంచనాలను బాగా దెబ్బతీసినట్లయింది. ఇటీవల దిల్లీలో జరిగిన ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్ల సమావేశంలో రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం ఇచ్చిన డిమాండ్‌ నోటీసులో పేర్కొన్నట్లుగానే పార్టు-1, పార్టు-2 కింద పింఛను లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. రవుర్కెలా ఈ రకంగా డిమాండ్‌ నోటీసులు ఇస్తున్న విషయాన్ని పేర్కొంటూ ‘ఈనాడు’ గత నెలలో కథనం ఇచ్చింది. ఇప్పుడు అదే పద్ధతిని అంతా అనుసరించాలని... అధిక పింఛనుకు అర్హులైన వారికి పింఛను చెల్లింపు ఆర్డర్లు (పీపీవో) జారీ చేయాలని సూచించింది.

రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం ఏం చేస్తోందంటే...

1995 నవంబరు 16 నుంచి 2014 ఆగస్టు 31 వరకు చేసిన సర్వీసుకు చివరి ఏడాది వేతన సగటు తీసుకుని పార్ట్‌-1 కింద; 2014 సెప్టెంబరు 1 నుంచి పదవీ విరమణ చేసిన నాటివరకు చివరి ఐదేళ్ల వేతన సగటు తీసుకుని పార్ట్‌-2 కింద గణించి ఆ రెండింటినీ కలిపి తుది పింఛను ఖరారు చేస్తోంది.

2023 జూన్‌ 1 ఫార్ములాకు విరుద్ధం

అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్‌వో 2023 జూన్‌ 1న స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబరు 1 నాటికి రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా లెక్కించాలని సూచించింది. 2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కించాలని తెలిపింది. తాజాగా రవుర్కెలా పద్ధతి అమలు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్‌వో స్పష్టం చేయడంతో పింఛను మొత్తం తగ్గుతుంది.

డీడీలూ తీసుకోని వైనం

అధిక పింఛనుకు అర్హులైన వారు ఈపీఎస్‌కు చెల్లించాల్సిన మొత్తంపై ఈపీఎఫ్‌వో డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తోంది. నోటీసుల్లో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్న వారికి ప్రాంతీయ కార్యాలయాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. డీడీలు తీసుకుని వస్తే తిరస్కరిస్తున్నాయి. ఆ మొత్తాన్ని వారు పనిచేస్తున్న యజమానికి ఇచ్చి యాజమాన్యం ద్వారా ఆన్‌లైన్లో చెల్లించాలని చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై యాజమాన్యాలూ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇలా చెల్లింపులు చేస్తే ఆదాయపన్ను, ఇతర న్యాయసమస్యలు వస్తాయని పేర్కొంటున్నాయి.


ఇదీ నష్టం...!

ఉదాహరణకు ఒక ఉద్యోగి ఓ ప్రైవేటు సంస్థలో 2000 నుంచి 2023 వరకు 23 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ ఉద్యోగి చివరి ఐదేళ్ల వేతన సగటు (మూలవేతనం, డీఏ కలిపి) రూ.40,000గా ఉంది. అతనికి 2023 జూన్‌ 1 నాటి ఆదేశాల ప్రకారం నెలకు రూ.13,142 పింఛను రావాలి.

పార్టు-1, పార్టు-2గా విభజించి లెక్కిస్తే...

ఆ ఉద్యోగికి 2014 ఆగస్టు 31 నాటికి చివరి ఏడాది వేతన సగటు రూ.26 వేలు అనుకుందాం. అప్పుడు అతని సర్వీసు కాలం 14 ఏళ్లు. ఈ లెక్కన పార్టు-1 కింద పింఛను రూ.5,200 అవుతుంది. 2023 నాటికి మిగతా తొమ్మిదేళ్ల సర్వీసుకు ఐదేళ్ల వేతన సగటు తీసుకుంటే పార్టు-2 కింద పింఛను రూ.5,142 అవుతుంది. ఈ లెక్కన పార్టు-1, పార్టు-2 కలిపి తుది పింఛను రూ.10,342 అవుతుంది. అంటే దాదాపు రూ.3000 తగ్గుతుంది.

ఇదీ పింఛను లెక్కింపు ఫార్ములా = (వేతన సగటు x సర్వీసు)/70


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని