investment: అనిశ్చితిలోనూ కొనసాగాలి మదుపు

ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా.. మన స్టాక్‌ మార్కెట్లు అనుకూలంగానో.. ప్రతికూలంగానో స్పందిస్తుంటాయి. రోజువారీగా ఎన్నో పరిణామాలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తాయి.

Updated : 27 Oct 2023 00:50 IST

ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా.. మన స్టాక్‌ మార్కెట్లు అనుకూలంగానో.. ప్రతికూలంగానో స్పందిస్తుంటాయి. రోజువారీగా ఎన్నో పరిణామాలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తాయి. మార్కెట్‌లో అస్థిరత ఒక సర్వసాధారణ అంశం. మరోవైపు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇదొక అవకాశమూ అని చెప్పొచ్చు. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ మదుపు మొత్తాన్ని జాగ్రత్త చేసుకోవడానికి అనుసరించాల్సిన సూత్రాలేమిటో చూద్దాం.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం, కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, అమెరికాలో బాండ్ల వడ్డీ రేటు 5 శాతానికి మించడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ.. ఇలా ఎన్నో కారణాలతో స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. కొన్నాళ్ల వ్యవధిలోనే మార్కెట్‌ వేల పాయింట్లను నష్టపోయింది. రూ.లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరయ్యింది. ఏడాదిన్నర కాలంగా ఎలాంటి అడ్డంకులూ లేకుండా పెరిగిన సూచీలకు దిద్దుబాటు సమయం వచ్చిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తంగా ఉండటంతో పాటు, భవిష్యత్‌ దృష్టితో మదుపును కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇలాంటి అనిశ్చితి సమయంలో ఏం చేయాలంటే...

ఆందోళన వద్దు...

అస్థిరమైన మార్కెట్‌లో ఎన్నో భయాందోళనలు ఉంటాయి. వదంతులు వస్తుంటాయి. వీటన్నింటి ఆధారంగా మీ పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆందోళనలకు గురిచేసే విశ్లేషణలు, సలహాలతో చాలామంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నష్టపోవడం చూస్తూనే ఉంటాం. మార్కెట్లు తిరిగి కోలుకున్నప్పుడు ఇలాంటివారు చింతిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలాంటివి మీ దగ్గరున్న నగదు నిల్వల విలువను తగ్గిస్తాయి. పెట్టుబడుల రూపంలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు రాబట్టుకోగలం. స్టాక్‌ మార్కెట్‌పై బాహ్య ప్రభావాలను ఎవరూ నియంత్రించలేరు అనేది వాస్తవం. పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందడం కాదు. మీరు తెలుసుకుంటున్న సమాచారం ఎంత మేరకు సరైనదో    చూసుకోండి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు పెట్టుబడుల విలువ తగ్గడం సహజమేననే వాస్తవాన్ని అంగీకరించండి. దీనికి తగ్గట్టుగా మీ ప్రణాళికలు ఉండాలి.

ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా...

పెట్టుబడులు ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. వాటిని సాధించే వరకూ మదుపు సాగుతూనే ఉండాలి. మధ్యలోనే వదిలేస్తే ఎటూకాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం. మీరు అయిదేళ్లపాటు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకున్నారు. ఇంకా ఒకటి రెండు నెలలు మాత్రమే ఉంటే.. మీ పెట్టుబడిని తక్కువ నష్టభయం ఉన్న పథకాల్లోకి మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా రెండుమూడేళ్లపాటు వ్యవధి ఉంటే.. అదే పథకంలో కొనసాగిస్తూనే ఉండాలి. మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం కొనసాగితే.. నష్టభయం అంత తగ్గుతుంది. సగటు రాబడీ అధికంగా వస్తుంది. క్రమానుగుత పెట్టుబడి విధానం (సిప్‌) మార్గంలో మదుపు చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్‌ హెచ్చుతగ్గుల్లో సగటు ప్రయోజనాన్ని అందుకోవచ్చు.

సమీక్షిస్తూ ఉండాలి..

సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ పెట్టుబడులు సమీక్షించుకునేందుకు మంచి అవకాశం అని చెప్పొచ్చు. కొన్ని షేర్లు, ఫండ్‌ పథకాల్లో ఇలాంటి సందర్భాల్లోనూ మంచి పనితీరు కనిపిస్తుంటుంది. కొన్ని మరీ తీవ్రంగా నష్టపోతాయి. కోలుకునేందుకు చాలా ఏళ్లు పట్టొచ్చు. ఇలాంటి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయొచ్చు. మీ పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సమతౌల్యం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఎక్కువ నిధులను ఈక్విటీలకు మార్చడం, అలాగే సురక్షిత పథకాలపైనే ఎక్కువగా ఆధారపడటం రెండూ మంచిది కాదు. సమయానుకూలంగా ఏం చేయాలన్నది నిర్ణయించుకొని, ఆ  ప్రణాళికలను అమలు చేయాలి.

కొత్త పెట్టుబడులకు అనుకూలం..

మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లు పతనం సమయంలో అందుబాటు ధరలోకి వస్తాయి. ఇలాంటి వాటిని ఎంచుకొని, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయాలి. మార్కెట్లు మళ్లీ పెరుగుతున్నప్పుడు ఇవి మంచి లాభాలను పంచే అవకాశం లేకపోలేదు. మంచి షేర్లను అవకాశాన్ని బట్టి, సగటూ చేసుకోవచ్చు. నష్టభయాన్ని ఎంత మేరకు భరించగలరో చూసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
స్టాక్‌ మార్కెట్‌పై పూర్తి అవగాహన, ఎప్పటికప్పుడు పరిశీలించే సమయం ఉన్నప్పుడే నేరుగా షేర్లలో పెట్టుబడులు పెట్టాలి. లేకపోతే మ్యూచువల్‌ ఫండ్ల లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.

వైవిధ్యంగా...

నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ప్రయత్నించాలి. దీనికోసం పెట్టుబడులు ఒకే చోట కాకుండా.. పలు పథకాలకు కేటాయించాలి. నష్టభయం  అధికంగా ఉంటూ, ఎక్కువ రాబడినిచ్చే పథకాల్లో కొంత, సురక్షిత పథకాల్లో కొంత మొత్తం మదుపు చేయాలి. కేవలం ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్ల వంటి స్థిరాదాయ పథకాలనూ ఎంచుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి బంగారానికి ఉంది. అందుకే, పెట్టుబడులకు కేటాయించే మొత్తంలో 5-10 శాతం వరకూ పసిడికీ కేటాయించాలి. అప్పుడే అన్ని పెట్టుబడి పథకాలూ మన లక్ష్య సాధనలో తోడుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని