Travel Insurance: విదేశాలకు వెళ్తున్నారా?బీమా మర్చిపోవద్దు

విహార యాత్రలకు వెళ్లి సరదాగా కొన్ని రోజులు గడపాలనే ఆలోచన ఉందా? ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకొని, అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారా? మరి, విదేశాల్లో ఏదైనా అనుకోని కష్టం వస్తే ఆదుకునే ప్రయాణ బీమా తీసుకున్నారా?

Updated : 15 Dec 2023 02:53 IST

విహార యాత్రలకు వెళ్లి సరదాగా కొన్ని రోజులు గడపాలనే ఆలోచన ఉందా? ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకొని, అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారా? మరి, విదేశాల్లో ఏదైనా అనుకోని కష్టం వస్తే ఆదుకునే ప్రయాణ బీమా తీసుకున్నారా?

 కుటుంబంతో విహార యాత్రలు ఎప్పుడూ మనకు ప్రత్యేకమే. పదికాలాల పాటు ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలి. కానీ, అన్నీ మనం అనుకున్నట్లుగానే జరగకపోవచ్చు. కొన్నిసార్లు వైద్య అత్యవసరాలు రావచ్చు. కొన్నిసార్లు సామగ్రి పోగొట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నష్టాన్ని ప్రయాణ బీమా భర్తీ చేస్తుంది. ముఖ్యంగా డిసెంబరు-జనవరి మాసాల్లో ఈ బీమా అవసరం అధికంగా ఉంటుందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని దేశాలు పర్యటకులకు ప్రయాణ బీమా (ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌) తప్పనిసరి అని చెబుతున్నాయి.

ఊహించని ఖర్చులు మొత్తం ప్రయాణంపై ప్రభావం చూపిస్తాయి. వీటికి చాలా సందర్భాల్లో మనం సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణ బీమా మనకు భరోసానిస్తుంది. ఈ పాలసీని ఎంచుకునేటప్పుడు ఏయే అంశాలు   పరిశీలించాలంటే...

ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా..

మన దేశం నుంచి వేల మంది విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తుంటారు. వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. దీనికి రక్షణ కల్పించేలా పాలసీ ఉండేలా చూసుకోవాలి. అన్ని రకాల చికిత్సలకూ ఇది వర్తించాలి. మీకు దంత సమస్యలు వచ్చినా పరిహారం ఇచ్చేలా పాలసీ తీసుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా వైద్య చికిత్స ఖర్చులను చెల్లించేలా ఉండే పాలసీలకే ప్రాధాన్యం ఇవ్వండి.

అందుబాటులో ఉందా?

సాధారణంగా ప్రయాణ బీమా పాలసీలు తక్కువ ప్రీమియానికే లభిస్తాయి. అవసరాలకు తగ్గట్టుగా తీసుకునే వెసులుబాటూ ఉంటుంది. ఒకేసారి కుటుంబానికి అంతటికీ పాలసీ తీసుకోవచ్చు. ఒకసారి పాలసీ తీసుకుంటే ఎన్నో ప్రయాణాలకు ఉపయోగపడే విధంగానూ ఉంటుంది. ఇలాంటి పాలసీలు ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ వర్తించేలా ఒకే పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు ఐరోపాలోని 26 దేశాలకూ కలిసి, ఒకే గ్రూపు పాలసీని తీసుకోవచ్చు. బీమా ప్రీమియమూ విమాన టిక్కెట్టు ధరతో పోలిస్తే తక్కువే. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే.. బీమా ప్రీమియం దాదాపు రూ.672 వరకూ ఉంటుంది.

ఆర్థిక భద్రత..

ప్రయాణాల్లో చాలామందికి ఎదురయ్యే అనుభవం.. సరైన సమయానికి సామగ్రి అందకపోవడం. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి నష్టపరిహారం అందిస్తుంది. పర్యటకులూ తమ సామగ్రి అందకపోతే.. బీమా కంపెనీ ఇచ్చే పరిహారంతో కొత్త వాటిని కొనుగోలు చేయొచ్చు. విదేశీ ప్రయాణాలే కాకుండా, దేశీయంగా పర్యటించేటప్పుడూ ఈ బీమా పాలసీని కొనుగోలు చేయొచ్చు.

సులభంగా..

ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంల ద్వారా ప్రయాణ బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలవుతోంది. బీమా సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీకు కావాల్సిన విధంగా పాలసీని ఎంచుకోవచ్చు. ప్రయాణ వ్యవధి, ఎంత మొత్తానికి బీమా కావాలి, ప్రయాణం రద్దు, ఆరోగ్య అవసరాల్లాంటివన్నీ పాలసీలో ఉండేలా చూసుకోవాలి. బీమా కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ఉంటాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలించాలి. క్లెయిం చెల్లింపుల్లోనూ ఎంత వేగంగా స్పందిస్తారన్నది తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

గుర్తుంచుకోండి..

  •  పాలసీ తీసుకునేటప్పుడు మీ పర్యటన రోజులన్నింటికీ వర్తించేలా చూసుకోండి. ప్రయాణం ప్రారంభమై, తిరిగి ఇంటికి వచ్చేదాకా ప్రయాణ బీమా పాలసీ కొనసాగేలా ఉండాలి.
  •  మినహాయింపులు, పరిమితులు ముందే తెలుసుకోండి. ముందస్తు వ్యాధుల చికిత్సకు వర్తిస్తుందా లేదా చూసుకోండి. కొన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక అవసరాలు ఉండొచ్చు. వాటికీ పాలసీ వర్తించేలా చూసుకోండి.
  •  ఏ క్షణమైనా మీకు సేవలను అందించేలా సహాయ కేంద్రాలు పనిచేస్తాయా? మీరు వెళ్లే ప్రాంతాల్లో ఎన్ని ఆసుపత్రులతో ఒప్పందాలున్నాయి అనే విషయాన్ని పరిశీలించండి.
  •  బీమా పాలసీలో పేర్కొన్న అంశాలకు అదనంగా ఏదైనా ఇతర ప్రయోజనాలూ అందిస్తున్నారా చూసుకోండి. ఉదాహరణకు ప్రయాణం ఆలస్యం కావడంలాంటివి చూసుకోవాలి.

పార్థనిల్‌ ఘోష్‌, ప్రెసిడెంట్‌, రిటైల్‌ బిజినెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని