వాహన బీమా.. అనుబంధాలతో అదనపు రక్ష

ప్రామాణిక పాలసీలో వాహనం దెబ్బతిన్నప్పుడు, థర్డ్‌పార్టీకి నష్టం వాటిల్లినప్పుడు బీమా సంస్థలు పరిహారం ఇస్తాయి. ఆనుబంధ పాలసీలు ఈ ప్రామాణిక పాలసీని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి సాధారణ పాలసీ పరిధిలో ఉండే అంశాలకు కాకుండా, ఇతర నష్టాలకు బీమా రక్షణను అందిస్తాయి.

Updated : 02 Feb 2024 04:44 IST

వాహనం రోడ్డు మీదకు రావాలంటే.. బీమా తప్పనిసరి. ప్రమాదం లేదా ఇతర కారణాలతో వాహనం దెబ్బతిన్నప్పుడు యజమానికి ఆర్థిక భారం కాకుండా ఇది కాపాడుతుంది. అదే సమయంలో ఇతరులకు వాటిల్లిన నష్టానికి థర్డ్‌ పార్టీ బీమా పరిహారాన్ని ఇస్తుంది. కారు బీమా నుంచి మరింత అదనపు రక్షణ పొందేందుకు వీలుగా పలు అనుబంధ పాలసీలూ ఇప్పుడు బీమా సంస్థలు అందిస్తున్నాయి. వీటిని యాడ్‌-ఆన్‌లుగా పిలుస్తారు. వీటిని తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా పాలసీదారుల ఇష్టమే. వీటి గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

ప్రామాణిక పాలసీలో వాహనం దెబ్బతిన్నప్పుడు, థర్డ్‌పార్టీకి నష్టం వాటిల్లినప్పుడు బీమా సంస్థలు పరిహారం ఇస్తాయి. ఆనుబంధ పాలసీలు ఈ ప్రామాణిక పాలసీని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి సాధారణ పాలసీ పరిధిలో ఉండే అంశాలకు కాకుండా, ఇతర నష్టాలకు బీమా రక్షణను అందిస్తాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే..

తరుగుదల లేకుండా...

ప్రమాదంలో కారు దెబ్బతిన్నప్పుడు మరమ్మతుకు అయ్యే ఖర్చును ఎలాంటి తగ్గింపు లేకుండా అందించేది ‘జీరో డిప్రిసియేషన్‌’. క్లెయిం మొత్తాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. సాధారణ వాహన బీమా పాలసీ ఉంటే.. తరుగుదల విలువను లెక్కించి, ఆ మేరకు మాత్రమే పరిహారం లభిస్తుంది. ఈ అనుబంధ పాలసీని జోడించుకోవడం వల్ల పూర్తి మొత్తాన్ని పొందేందుకు వీలవుతుంది. సాధారణంగా ఈ పాలసీని కారు కొన్న అయిదేళ్లపాటు తీసుకునేందుకు వీలుంటుంది.

ఇంజిన్‌కు రక్షణగా..

కారు ఇంజిన్‌, దాని విడి భాగాలు వరదలు లేదా ఆయిల్‌ లీక్‌ తదితర కారణాల వల్ల పాడయ్యే అవకాశం ఉంది. దీనికి సాధారణ పాలసీలో ఎలాంటి రక్షణా ఉండదు. ‘ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ కవర్‌’ తీసుకోవడం ద్వారా ఇలాంటి సందర్భాల్లో ఇంజిన్‌కు జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు. ముఖ్యంగా ఖరీదైన కార్లకు ఈ అనుబంధ పాలసీని తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండేవారు దీన్ని కచ్చితంగా తీసుకోవాలి. దీన్ని ప్రాథమిక పాలసీకి జోడించుకోవడం ద్వారా ఇంజిన్‌లో ముఖ్యమైన విడి భాగాలకూ బీమా రక్షణ లభిస్తుంది.

ఇన్వాయిస్‌ ధర చెల్లించేలా...

ప్రమాదం వల్ల వాహనం పనికిరాకుండా పోవడం, దొంగతనం జరిగిన సందర్భాల్లో ప్రామాణిక పాలసీ.. వాహన బీమా విలువ (ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వాల్యూ)ను మాత్రమే చెల్లిస్తుంది. దీనివల్ల వాహన యజమానికి అధిక నష్టం వస్తుంది. ‘రిటర్న్‌-టు-ఇన్వాయిస్‌’ అనుబంధాన్ని ఎంచుకున్నప్పుడు పైన పేర్కొన్న పరిస్థితుల్లో వాహనం ఇన్వాయిస్‌ ధరను చెల్లిస్తుంది. ఇందులో రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజులూ కలిసి ఉంటాయి. అంటే, కొత్త వాహనం తీసుకునేందుకు అవసరమైన మొత్తాన్ని ప్రాథమిక పాలసీకి జోడించిన ఈ అనుబంధ పాలసీ ద్వారా పొందవచ్చన్నమాట.

క్లెయిం చేసుకోకుంటే..

సాధారణంగా ఒక పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయింలూ చేయనప్పుడు నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ) లభిస్తుంది. దీనిద్వారా పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియంలో 20 -30 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. క్లెయిం చేసుకున్నా, ఎన్‌సీబీ వర్తించాలంటే.. ‘నో క్లెయిం బోనస్‌ ప్రొటెక్షన్‌’ అనుబంధ పాలసీని తీసుకున్నప్పుడు పాలసీ ఏడాదిలో క్లెయిం చేసుకున్నప్పటికీ, ఎన్‌సీబీని పొందేందుకు వీలుంటుంది. ఒకటి కంటే ఎక్కువ క్లెయింలుంటే.. ఇది వర్తించకపోవచ్చు. కొత్త వాహనం తీసుకున్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకునేందుకు వీలుంటుంది. మూడేళ్లకు మించిన వాహనాలకు ఈ యాడ్‌-ఆన్‌ అందుబాటులో ఉండదు.

సహాయం కోసం..

ప్రయాణాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సహాయం అందించేలా ‘రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌’ యాడ్‌-ఆన్‌ తోడ్పడుతుంది. ముఖ్యంగా వాహనం మొరాయించినప్పుడు, ఇంధనం లేక నిలిచిపోయినా, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఈ కవర్‌ కింద ఎప్పుడైనా, ఎక్కడైనా బీమా సంస్థ నుంచి సహాయం పొందవచ్చు. వాహనాన్ని దగ్గరలో ఉన్న మరమ్మతు కేంద్రానికి తరలించడంతో పాటు, కారులో ఉన్న ప్రయాణికులకు తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయడంలాంటివీ ఇందులో భాగంగా వస్తాయి.  
వీటితోపాటు కారు తాళం చెవి కనిపించకుండా పోయినప్పుడు దాన్ని తిరిగి తీసుకునేందుకు అయ్యే ఖర్చు కోసం ‘కీ రిప్లేస్‌మెంట్‌’ యాడ్‌-ఆన్‌ అందుబాటులో ఉంది. కారు ప్రమాదం తర్వాత మరమ్మతు చేస్తున్నప్పుడు, మీ రోజువారీ ప్రయాణానికి క్యాబ్‌ను అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకోసం బీమా సంస్థ పరిహారాన్ని అందిస్తుంది. ఇది కారు మోడల్‌ను బట్టి రూ.100-రూ.500 వరకూ ఉంటుంది. దీనికోసం ‘డైలీ అలవెన్స్‌ బెనిఫిట్‌’ తీసుకోవాలి. వాహనంలో ఉన్న వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకున్న సందర్భంలో రూ.50వేల వరకూ పరిహారం లభించే అనుబంధ పాలసీ అందుబాటులో ఉంది. కారు మరమ్మతు సందర్భంలో వినియోగించే చిన్న చిన్న విడిభాగాల ఖర్చునూ చెల్లించేలా అనుబంధ పాలసీని తీసుకోవచ్చు.
కొత్త వాహనం కొనుగోలు చేసి, బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఈ అనుబంధాల గురించి స్పష్టంగా తెలుసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు