Global Recession: మాంద్యం అంచున ఉన్నాం.. డబ్ల్యూటీవో చీఫ్‌

అనేక సంక్షోభాల కారణంగా ప్రపంచం ప్రస్తుతం మాంద్యం(Global Recession) వైపు పయనిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) డైరెక్టర్‌ జనరల్‌ గోజి ఒకోంజో ఇవాలా తెలిపారు. వృద్ధిని పెంపొందించేందుకు విప్లవాత్మక...

Published : 28 Sep 2022 01:33 IST

జెనీవా: అనేక సంక్షోభాల కారణంగా ప్రపంచం ప్రస్తుతం మాంద్యం(Global Recession) వైపు పయనిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) డైరెక్టర్‌ జనరల్‌ నెగోజి ఒకోంజో ఇవేలా హెచ్చరించారు. వృద్ధిని పెంపొందించేందుకు విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, వాతావరణ సంక్షోభం, ఆహార ధరలు, ఇంధన కొరత, కొవిడ్ అనంతర పరిణామాలు.. మాంద్యం ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జెనీవాలో డబ్ల్యూటీవో వార్షిక పబ్లిక్ ఫోరంను ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ మేరకు మాట్లాడారు. ప్రధానంగా ఆహార భద్రతపై కలవరపడుతున్నట్లు తెలిపారు.

‘ఇప్పుడు మనం ప్రపంచ మాంద్యం అంచున ఉన్నాం. మన ముందున్న మాంద్యాన్ని తట్టుకోవాలి. అదే సమయంలో ఈ పరిస్థితుల నుంచి బయటపడటంపై దృష్టి సారించాలి. వృద్ధిని పునరుద్ధరించాలి’ అని ఇవేలా అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి.. ఈ రెండూ ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాయని గుర్తుచేశారు. ‘భద్రతాపర సమస్యలు, ఇంధన కొరత, వాతావరణ మార్పులు, ఆహార ధరలు.. ఇలా అన్ని సంక్షోభాలు ఒకే సమయంలో దేశాలను తాకుతున్నాయి. కాబట్టి.. ఈ సమయంలో వాణిజ్య కార్యకలాపాలను ఎప్పటిలాగే నిర్వహించలేం’ అని వ్యాఖ్యానించారు.

బ్యాంకులూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని డబ్ల్యూటీవో చీఫ్‌ పేర్కొన్నారు. ‘సెంట్రల్ బ్యాంకులకు వడ్డీ రేట్లను కఠినతరం చేయడం, పెంచడం మినహా ఎక్కువ అవకాశాలు లేవు. కానీ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, దేశాలపై ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే, అవి కూడా వడ్డీ రేట్ల పెరుగుదలను కఠినతరం చేస్తున్నాయి’ అని చెప్పారు. బలమైన డిమాండ్ వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతోందా? లేదా సరఫరా వ్యవస్థలో వ్యవస్థీకృత సమస్యల వల్ల ధరలు పెరుగుతున్నాయా? అనే విషయాన్ని కేంద్ర బ్యాంకులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని