వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు HCL సమాచారం

HCL Technologies: వారానికి 3 రోజులు చొప్పున కార్యాలయాలకు రావాలని ఉద్యోగులకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సమాచారం ఇచ్చింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Published : 16 Feb 2024 02:18 IST

HCL Technologies | దిల్లీ: ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి ఐటీ కంపెనీలు. ఈ విషయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ముందు వరుసలో ఉండగా.. మిగిలిన కంపెనీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ విషయమై తాజాగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (HCL Technologies) ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. డిజిటల్‌ ఫౌండేషన్‌ సర్వీసెస్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 19 నుంచి డీఎఫ్‌ఎస్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగులకు పంపిన మెమోలో పేర్కొంది. నిర్దేశించిన కార్యాలయాలకు హాజరుకావాలని, కనీసం మూడు రోజులు చొప్పున పనిచేయాలని అందులో తెలిపింది. ఉద్యోగుల రోస్టర్‌ వివరాలను మేనేజర్లు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ప్రస్తుతం డీఎఫ్‌ఎస్‌ డివిజన్‌లో 80 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు మాత్రం వారానికి ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిఉంటుందని ఐటీ కంపెనీ స్పష్టం చేసింది.

యాంటీ డ్రాప్‌ టెక్నాలజీతో హానర్‌ X9b.. ధరెంతంటే?

ఒకవేళ ఎవరైనా ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. అనధికారిక గైర్హాజరీగా పరిగణిస్తామని కంపెనీ పేర్కొంది. అలాంటివారిపై కంపెనీ పాలసీకి అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని స్పష్టంచేసింది. టీమ్‌ వర్క్‌ను పెంపొందించడం, ముఖాముఖి చర్చలు, పని సంస్కృతిని మరింత బలోపేతం చేయడం కోసం అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలూ పూర్తిగా ఆఫీసులకు రావాలని సూచిస్తుండగా.. మరికొన్ని వారానికి కొన్ని రోజులైనా రావాలని ఉద్యోగులను ఆదేశిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని