GST: హాస్టల్‌ వసతికి 12% జీఎస్టీ: ఏఏఆర్‌

GST on Hostel accommodation:హాస్టల్‌ వసతికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ రెండు వేర్వేరు కేసుల్లో స్పష్టంచేసింది. దీంతో హాస్టల్‌లో నివాసం ఉండే వారికి భారం కానుంది.

Updated : 29 Jul 2023 20:03 IST

దిల్లీ: హాస్టల్‌లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులకు హాస్టల్‌ వసతి భారం కావొచ్చు. హాస్టల్‌ ఫీజుకూ 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ అథారిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR) బెంచ్‌లు రెండు వేర్వేరు కేసుల్లో తీర్పు వెలువరించడం ఇందుకు నేపథ్యం. హాస్టల్స్‌, డార్మిటరీలు నివాస గృహాల కిందకు రావని, కాబట్టి జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపూ ఉండదంటూ బెంగళూరు, లఖ్‌నవూ బెంచ్‌లు తాజాగా తీర్పులు వెలువరించాయి.

బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీయిస్‌ స్టే ఎల్‌ఎల్‌పీ సంస్థ చేసిన దరఖాస్తుపై బెంగళూరు బెంచ్‌ తాజాగా తీర్పు ఇచ్చింది. హాస్టళ్లు అనేవి నివాస గృహాలు కావని, వాటికీ జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టంచేసింది. హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్‌సైట్ల వసతికి గానూ రోజుకు రూ.1000 లోగా అయితే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని గుర్తు చేసింది. 2022 జులై 17 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. పీజీ/ హాస్టళ్లకు ఇది వర్తించదని స్పష్టంచేసింది. నివాస గృహాన్ని నివాసానికి వినియోగించకుండా అద్దె కోసం వినియోగిస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. ఇక్కడ దరఖస్తుదారుడి (శ్రీసాయి హాస్టల్‌) సేవలు జీఎస్టీ విధించదగినవి కాబట్టి భూ యజమానులకు చెల్లించే అద్దెపై రివర్స్ జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. కాబట్టి జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ సొంత నివాసంలోనే హాస్టల్‌/ పీజీ సదుపాయం ఇస్తుంటే వాటిని గెస్ట్‌ హౌస్‌లు, లాడ్జింగ్‌ సర్వీసులుగానే పరిగణిస్తామని బెంచ్‌ పేర్కొంది.

పోకో నుంచి ఫస్ట్ ఇయర్‌బడ్స్.. రూ.1,199కే విక్రయం

నొయిడాకు చెందిన వీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్టల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విషయంలో ఏఏఆర్‌ లఖ్‌నవూ బెంచ్‌ సైతం ఇదే తరహా తీర్పును వెలువరించింది. హాస్టల్‌ వసతికి రోజుకు రూ.1000 తక్కువ ఉన్నా జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. ఎక్కువగా విద్యార్థులు నివాసం ఉండే హాస్టళ్లు, డార్మిటరీలపై 12 శాతం జీఎస్టీ విధించడం వల్ల ఆయా కుటుంబాలపై ఎనలేని భారం పడుతుందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ అన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఏఏఆర్‌ బెంచ్‌లు ఇచ్చిన తీర్పులను ఇతర రాష్ట్రాలు అమలుపరిస్తే హాస్టల్‌ వసతి భారం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని