ELSSతో పన్ను ఆదా.. దీర్ఘకాలంలో సంపద!

ఇతర సంప్రదాయ పన్ను ఆదా పెట్టుబడులతో పోలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌ మంచి రాబడినే అందిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు..

Updated : 13 Feb 2023 14:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబడులు (Investments), ఈక్విటీలు (Equities), మ్యూచువల్‌ ఫండ్లు (Mutual funds), పొదుపు (Savings).. ఇవన్నీ ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కువగా చర్చించే అంశాలు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదా గురించి ఆలోచించే సమయం ఇది కాబట్టి. సాధారణంగా సంప్రదాయ పన్ను ఆదా పెట్టుబడులతో వచ్చే చిక్కు ఏంటంటే.. అవి దీర్ఘకాల లాక్‌-ఇన్‌ పీరియడ్‌తో వస్తాయి. తక్కువ రాబడిని అందిస్తాయి. మరి పన్ను ఆదా చేస్తూనే దీర్ఘకాలంలో సంపదను సృష్టించగల పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా అంటే.. ఉందనే చెప్పాలి. అదే ఈఎల్‌ఎస్‌ఎస్‌ (ELSS).

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ELSS).. ఇటీవలి కాలంలో ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటిగా ఉద్భవించింది. పన్ను ఆదా ప్రయోజనాలను అందించడంతో పాటు దీర్ఘకాలికంగా సంపద సృష్టించడంలో సహాయపడుతుంది. ఇదే ఈ పెట్టుబడులను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు దోహదం చేస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యమనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

స్మార్ట్‌ ట్యాక్స్‌ సేవింగ్‌..

దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ELSS ఫండ్‌లో రూ.50 ఫండ్‌ నికర విలువతో (NA) 3000 యూనిట్లను కొనుగోలు చేశారనుకుందాం. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పెట్టుబడులకు రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు అర్హత ఉంటుందని మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రాథమిక స్థాయిలో మీరు రూ.46,800 వరకు పన్ను రాయితీకి అర్హులు. ఇది మాత్రమే కాకుండా ఈఎల్‌ఎస్‌ఎస్‌ మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

లాక్‌-ఇన్‌ మంచిదే..

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్‌ ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి మూడేళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌. అంటే పెట్టుబడిదారుడు తమ పెట్టుబడులు తిరిగి తీసుకునేందుకు 3 ఏళ్లు వేచి ఉండాలి. ఇది మదుపర్లు స్వల్పకాలిక మార్కెట్‌ ఒడుదొడుకులకు లోనుకాకుండా దీర్ఘకాలంపాటు పెట్టుబడులు కొనసాగించేలా చూస్తుంది.

మార్కెట్‌ హెచ్చుతగ్గులు..

మార్కెట్లు పతనం అయినప్పుడు, ఈఎల్‌ఎస్ఎస్‌ ఫండ్లు అంతర్లీన షేర్లకు సంబంధించి మరిన్ని యూనిట్లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఫండ్‌ నికర విలువ (NAV) అంతర్లీన షేర్ల విలువతో నేరుగా ముడిపడి ఉంటుంది. పర్యవసానంగా మార్కెట్లు కోలుకున్నప్పుడు అంతర్లీన షేర్ విలువ పెరిగి, ఫండ్‌ ఎన్‌ఏవీ కూడా పెరుగుతుంది. ఫలితంగా మదుపర్లకు అధిక రాబడి వస్తుంది. దీర్ఘకాలంలో మార్కెట్లు వివిధ దశల్లో ట్రావెల్‌ చేసినప్పుడు లాభం పొందొచ్చు. 

ఫండ్‌ మేనేజర్లు.. పనితీరు

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ (ELSS) ప్రధానంగా షేర్లలో పెట్టుబడి పెడుతుంటాయి. మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్లు పెట్టుబడి మొత్తం మూడేళ్లు లాక్‌ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో మదుపర్లు వారి డబ్బు విత్‌డ్రా చేసుకోలేరు. ఈ ఫీచర్‌ మదుపర్లతో పాటు ఫండ్‌ మేనేజర్‌ ప్రయోజనాలను కాపాడడంలో సహాయపడుతుంది. ఫండ్‌ మేనేజర్లు మార్కెట్లో ఏర్పడే స్వల్పకాలిక ఒడుదొడుకుల కంటే దీర్ఘకాలిక పనితీరుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉటుంది. 

విరామం తీసుకోవచ్చు..

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ పెట్టుబడుల్లో ‘పాజ్‌’ ఎంపిక ఉంటుంది. మదుపర్లు తమ పెట్టుబడులను పూర్తిగా రద్దు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, క్రమం తప్పకుండా సహకారం అందించలేకపోయినా పెట్టుబడి మార్కెట్ వృద్ధిలో పాల్గొనేందుకు సహాయపడుతుంది. పెట్టుబడి విలువ, మార్కెట్ సాధారణ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. మదుపర్లు వారి పెట్టుబడిపై రాబడిని పొందుతూనే ఉంటారు. ఈ విధంగా వారు పెట్టుబడులను (SIP) పూర్తిగా ఆపేసినా అప్పటి వరకు చేసిన పెట్టుబడిపై మార్కెట్ వృద్ధిని కోల్పోకుండా సహాయపడుతుంది.

చివరిగా..

ఇతర సంప్రదాయ పన్ను ఆదా పెట్టుబడులతో పోలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఎక్కువ రాబడి అందించవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో 80% డైవర్సిఫైడ్‌ ఆస్తులు ఉంటాయి. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరిత్రను పరిశీలిస్తే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఎల్లప్పుడూ దీర్ఘకాలంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడులను అందించాయి. కేవలం రూ.500 నెలవారీ సిప్‌తో ఈఎల్‌ఎస్‌ఎస్‌లో మదుపు చేయవచ్చు. సిప్‌ విధానంలో పెట్టుబడి పెట్టడం వల్ల రూపాయి ధర సగటు ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. మీ సౌలభ్యం మేరకు పెట్టుబడి పెట్టవచ్చు. క్రమశిక్షణతో కూడిన మదుపును అలవరచుకోవచ్చు. ఈ విధంగా పన్ను ఆదాతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఈఎల్‌ఎస్‌ఎస్‌ మంచి ఎంపికే. ప్రతి సిప్‌నకు 3 ఏళ్ల లాక్ ఇన్ ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. 

- గిరిరాజన్‌ మురుగన్‌, సీఈఓ, ఫండ్స్‌ ఇండియా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు