Income tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిఫండ్‌కు ఎంత సమయం పడుతుంది?

Income tax: ఐటీ రిఫండ్‌ ఎప్పుడు వస్తుందని చాలా మంది వేచి చూస్తున్నారు. దీనిపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం!

Published : 29 Aug 2023 13:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు (ITR) గడువు 2023 జులై 31తో ముగిసింది. చివరి నిమిషంలో హడావుడిగా ఫైల్‌ చేసినవారు రిఫండ్‌ కోసం వేచిచూస్తున్నారు. అయితే, దీనికి ఎంత సమయం తీసుకుంటుందనే అంశంపై అందరిలో సందేహం నెలకొంది.

రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని కచ్చితంగా 30 రోజుల్లోగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. లేదంటే ఐటీఆర్‌ చెల్లకుండా పోతుందని ఆదాయ పన్ను విభాగం స్పష్టం చేసింది. వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత దాదాపు 4-5 వారాల్లోగా రిఫండ్‌ జమ అవుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఐటీఆర్‌ దాఖలు చేసిన 7-8 రోజుల్లో కూడా రిఫండ్‌ వచ్చేస్తుంటుంది.

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా? ఇలా చేయండి

ఐటీఆర్‌ సమర్పించిన తర్వాత ఆదాయ పన్ను విభాగం దాన్ని ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్‌ 143(1) ప్రకారం పన్ను చెల్లింపుదారుల ఇ-మెయిల్‌ ఐడీతో పాటు ట్యాక్స్‌ పోర్టల్‌లోని ఇ-ఫైలింగ్‌ అకౌంట్‌కు సందేశం వస్తుంది. ఐటీఆర్‌లో సమర్పించిన వివరాలు ఆదాయ పన్ను విభాగం వద్ద ఉన్న రికార్డులతో సరిపోలాయో.. లేదో.. తెలియజేస్తుంది. ఒకవేళ ఎలాంటి లోపాలు లేనట్లయితే రిఫండ్‌ అందనున్నట్లు చెబుతుంది. ఎంత మొత్తమో కూడా పేర్కొంటుంది. అందుకే ఐటీఆర్‌ సమర్పించిన తర్వాత వచ్చే నోటీసులను క్షుణ్నంగా పరిశీలించాలి.

ఒకవేళ రిఫండ్‌ ఆలస్యమైతే.. మరోసారి ఐటీ విభాగం నుంచి అందిన అన్ని నోటీసులను సరిగా పరిశీలించాలి. ఏమైనా లోపాలు ఉన్నట్లు పేర్కొన్నారేమో గమనించాలి. ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో రిఫండ్‌ స్టేటస్‌ను కూడా చెక్‌ చేసుకుంటూ ఉండాలి.  ఐటీఆర్‌ ప్రాసెసింగ్‌కు ఎంత సమయం తీసుకోవాలో ఐటీ యాక్ట్‌ 1961లో స్పష్టంగా పేర్కొన్నారు. రిటర్నులు దాఖలు చేసిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తొమ్మిది నెలల్లోగా పన్ను చెల్లింపుదారులకు సమాచారం అందించాలి. 2021 ఏప్రిల్‌ 1 నుంచి ఈ సమయాన్ని మూడు నెలలు కుదించారు. ఒకవేళ మరీ ఆలస్యమైతే.. ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు