Credit Card: మీకు ఏది సరైన క్రెడిట్‌ కార్డు? ఎలా ఎంపిక చేసుకోవాలంటే..

Credit Card: మన అవసరాలకు సరిపడే క్రెడిట్‌ కార్డునే ఎంపిక చేసుకోవాలి. అప్పుడే దాన్నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందగలుగుతాం. 

Updated : 12 Feb 2023 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది క్రెడిట్‌ కార్డు (Credit Card)ను ఒక చెల్లింపు సాధనంగా మాత్రమే భావిస్తుంటారు. అలా మీరూ అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ప్రతికార్డ్‌పై రివార్డు పాయింట్లు, రాయితీలు, క్యాష్‌బ్యాక్‌ సహా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వాటిని సరిగా ఉపయోగించుకోవాలి. అలా అయితేనే, క్రెడిట్‌ కార్డు (Credit Card) ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారని అర్థం. కార్డు ఎంపిక చేసుకునేప్పుడే మన అవసరాలకు అనుగుణంగా ఉన్న దాన్ని తీసుకోవాలి. మరి అలా ఎంపిక చేసుకోవడంలో మనకు ఉపయోగపడే కొన్ని అంశాలను పరిశీలిద్దాం..  

అర్హతలు..

క్రెడిట్‌ కార్డు (Credit Card) తీసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. మన అర్హతలకు ఏ కార్డులు అందుబాటులో ఉన్నాయో ముందే చూసుకోవాలి. కొన్ని సంస్థలు అధిక ఆదాయం, ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)ని అడుగుతుంటాయి. మరికొన్ని ఈ విషయంలో కాస్త ఉదారంగా ఉంటాయి. అందుకే కార్డు పొందడానికి కావాల్సిన అర్హతలు మనకు ఉన్నాయో.. లేదో.. ముందే చూసుకోవాలి. మన అర్హతలు సరిపోని కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే తిరస్కరణ తప్పదు. అది క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score)పై ప్రభావం చూపుతుంది.

ఖర్చుల తీరు..

మన ఖర్చుల తీరు ఎలా ఉందో చూసుకోవాలి. దానికి అనుగుణంగా క్రెడిట్‌ కార్డుని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ప్రయోజనాన్ని మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రోజూ కారులో లేదా బైకుపై ప్రయాణం చేసే ఉద్యోగులుంటారు. వారు పెట్రోల్‌ లేదా డీజిల్‌ కొనుగోలుపై రాయితీనిచ్చే కార్డును తీసుకోవాలి. కొందరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తుంటారు. అలాంటివారు ప్రముఖ బ్రాండ్లు, వెబ్‌సైట్లలో చేసే షాపింగ్‌పై డిస్కౌంట్లిచ్చే కార్డును ఎంపిక చేసుకుంటే బెటర్‌. అయితే, కార్డుపై ఉన్న షరతులను మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆయా ప్రయోజనాలను పొందడం కోసం కొన్ని కండిషన్లు ఉంటాయి. ఉదాహరణకు ప్రతినెలా నిర్ధిష్ట మొత్తం కంటే ఎక్కువ బిల్లు చేస్తేనే ప్రయోజనాలు అందుతాయనే షరతు ఉంటుంది.

క్రెడిట్ లిమిట్‌..

గరిష్ఠంగా ఒక కార్డుపై చేయడానికి అనుమతించే వ్యయాన్నే క్రెడిట్‌ లిమిట్‌ (Credit Limit) అంటారు. వ్యక్తి ఆదాయం, క్రెడిట్‌ స్కోరు (Credit Score) ఆధారంగా జారీ సంస్థలు దీన్ని నిర్ణయిస్తాయి. అయితే, అధిక మొత్తం క్రెడిట్‌ లిమిట్‌ (Credit Limit) ఉన్న కార్డుని తీసుకోవాలి. అలా అని ఉన్న పరిమితి మేరకు ఖర్చు చేయడం సరికాదు. దీన్ని బ్యాంకులు ప్రతికూలంగా తీసుకుంటాయి. క్రెడిట్‌ లిమిట్‌ (Credit Limit)లో 50 శాతానికి మించి ఖర్చు చేయొద్దని నిపుణులు సూచిస్తుంటారు. ఇది క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) పెరగడానికి దోహదం చేస్తుంది. అయితే, అధిక క్రెడిట్‌ లిమిట్‌ ఉంటే వైద్య ఖర్చుల లాంటి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది.

బడ్జెట్‌కి అనుగుణంగా..

క్రెడిట్‌ కార్డు (Credit Card)పై ప్రతినెలా ఎంత ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకోవాలి. అందుకు తగిన బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. నిత్యావసరాలు, షాపింగ్‌, ఇతర బిల్లు చెల్లింపులకు ప్రతినెలా ఎంత ఖర్చవుతుందో చూసుకోవాలి. అందుకనుగుణంగా మీ కార్డుని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు నెలకు మీరు రూ.15,000 ఖర్చు చేస్తున్నారనుకుందాం. దీనిపై 10శాతం రాయితీనిచ్చే కార్డుని తీసుకుంటే నెలకు మీరు రూ.1,500 ఆదా చేసుకున్నట్లే!

వార్షిక రుసుము..

చాలా బ్యాంకులు ఎలాంటి వార్షిక రుసుము (Annual Fee) లేకుండానే క్రెడిట్‌ కార్డు (Credit Card)లను ఆఫర్‌ చేస్తుంటాయి. ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ, ఇతర ప్రయోజనాలను పరిమితం చేసే అవకాశం ఉంది. కొన్ని కార్డులపై అధిక వార్షిక రుసుము ఉన్నప్పటికీ.. ప్రయోజనాలు మాత్రం చాలా బాగుంటాయి. అందుకే యాన్యువల్‌ ఫీజు విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

అదనపు ప్రయోజనాలు..

సాధారణ ప్రయోజనాలతో పాటు విమానాశ్రయాల్లో లాంజ్‌ యాక్సెస్‌, విమాన టికెట్లపై రాయితీ, హోటల్‌ బుకింగ్‌లలో తగ్గింపు వంటి అదనపు ప్రయోజనాలు కూడా క్రెడిట్‌ కార్డులో ఉంటాయి. అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయో.. లేదో.. చూసుకొని కార్డుని ఎంపిక చేసుకోవాలి.

ఎలాంటి కార్డు ఎంపిక చేసుకున్నా సకాలంలో బిల్లు తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం. అప్పుడే సరైన ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. కనీస మొత్తం చెల్లించి మిగిలిన బకాయిని వాయిదా వేయడం కూడా సబబు కాదు. లేదంటే చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

- సంజీవ్‌ మోఘే, యాక్సిస్‌ బ్యాంక్‌లో కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌ విభాగాధిపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు