Retirement: పదవీ విరమణ నిధి కోసం ఏ వయసులో ఎంత పెట్టుబడి అవసరం?

వివిధ వయసులవారికి పదవీ విరమణ నిధి ఎంత మొత్తం వరకు అవసరం పడుతుంది? ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 26 Dec 2022 17:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా మంది తమ కెరీర్‌ ప్రారంభంలో తమ పదవీ విరమణ ప్రణాళికను ప్రారంభించరు. ఇంకా చాలా కాలం ఉంది కదా అనుకుంటారు. కానీ, సంపాదన మొదలైన వెంటనే రిటైర్‌మెంట్‌ నిధి గురించి ఆలోచించి అమలుచేయడం మంచిది. దీని వల్ల అనవసర ఒత్తిడి ఉండదు. తగినంత నిధిని సమకూర్చుకోవడానికి ద్రవ్యోల్బణం, ఆయుర్ధాయం, పెరుగుతున్న వైద్య ఖర్చులు వంటి బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. జీవితంలోని వివిధ దశలలో ఈ ప్రణాళిక ఎలా చేయాలో తెలుసుకోవాలి. 60 సంవత్సరాలకు ఒక వ్యక్తి రిటైర్‌ అవుతారు అనుకుందాం. అతను 80 సంవత్సరాల వరకు ఆయుర్ధాయం ఉంటుంది అనుకుంటే.. 30,40,50 సంవత్సరాల వయసులో ఉన్నవారు ప్రతి నెలా ఎంత సమకూర్చుకోవాలి అన్నది ఇక్కడ చూద్దాం..

30 ఏళ్ల వ్యక్తికి పదవీ విరమణ ప్రణాళిక

మీ ప్రస్తుత నెలవారీ ఖర్చులు రూ.30 వేలు అనుకుందాం. సంవత్సరానికి 5% సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. పదవీ విరమణ (60 సంవత్సరాల వయసు) నాటికి నెలవారీ వ్యయం రూ.1.33 లక్షలు అవుతుంది. ఫలితంగా, పదవీ విరమణ చేసిన మొదటి సంవత్సరంలోనే వార్షిక ఖర్చులు దాదాపు రూ.16 లక్షలు అవసరం పడొచ్చు. మీకు 80 ఏళ్లు వచ్చే వరకు (ప్రతి సంవత్సరం 5% ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తే), ఈ మొత్తం పొందాలంటే మీకు అవసరమయ్యే మొత్తం నిధి రూ.5.30 కోట్లు. 12 శాతం రాబడి అంచనా వేస్తే.. దీని కోసం ఇప్పటి నుంచే (ప్రతి సంవత్సరం 10% పెంపుతో) నెలనెలా రూ.7000 పెట్టుబడి పెట్టాలి. 

40 ఏళ్ల వ్యక్తికి పదవీ విరమణ ప్రణాళిక

ఈ వయసులో కుటుంబ బాధ్యతలు పెరుగుతుంటాయి. ఆరోగ్య సమస్యలు ప్రారంభమవుతుంటాయి. తమ పదవీ విరమణ తర్వాత ఖర్చుల గురించి ఈ వయసులోనే చాలా మంది తెలుసుకుంటారు. పదవీ విరమణ (60 సంవత్సరాల వయసు) నాటికి నెలవారీ వ్యయం రూ.80 వేలు అవుతుంది. మీకు 80 ఏళ్లు వచ్చే వరకు, ఈ మొత్తం పొందాలంటే మీకు అవసరమయ్యే మొత్తం నిధి రూ.1.75 కోట్లు. 12 శాతం రాబడి అంచనా వేస్తే.. దీని కోసం ఇప్పటి నుంచే (ప్రతి సంవత్సరం 10% పెంపుతో) నెలనెలా రూ.9500 పెట్టుబడి పెట్టాలి. 

50 ఏళ్ల వ్యక్తికి పదవీ విరమణ ప్రణాళిక

పదవీ విరమణకు కేవలం 10 ఏళ్ల దూరంలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ, ఈ వయసులో కూడా పదవీ విరమణకు తగిన ప్రణాళికతో ఉండడం సాధ్యమే. ఈ వయసులో మీ నెలవారీ ఖర్చులు దాదాపు రూ.30 వేలు అనుకుంటే..10 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసిన నాటికి మీకు రూ.50 వేలు అవసరం పడుతుంది. ఏడాదికి 5% ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. పదవీ విరమణ తర్వాత 20 సంవత్సరాల పాటు ఈ మొత్తం పొందాలంటే రూ.1.10 కోట్లు అవసరం పడుతుంది. 12 శాతం రాబడి అంచనా వేస్తే.. దీని కోసం ఇప్పటి నుంచే (ప్రతి సంవత్సరం 10% పెంపుతో) నెలనెలా రూ.35,000 పెట్టుబడి పెట్టాలి.

చివరిగా: పైన తెలిపిన పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లో సిప్ ఎంచుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్ ఎంచుకున్నట్లైతే కొంత వరకు రిస్క్ తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని