Bharat Expo: రికార్డు సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నాం: మోదీ

వరుసగా మూడోసారి తామే అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఆ కాలంలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని తెలిపారు.

Published : 02 Feb 2024 21:40 IST

దిల్లీ: ఆర్థికాభివృద్ధిలో భారత్‌ దూసుకెళ్తోందని.. వరుసగా మూడోసారి ఏర్పడే తమ ప్రభుత్వ హయాంలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలో నిర్వహించిన ‘భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో’ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో భాగంగా 1000 ఆధునిక విశ్రాంతి గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు.

‘‘2014కి ముందు పదేళ్లలో దేశంలో దాదాపు 12 కోట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. అదే 2014 నుంచి ఇప్పటివరకు ఈ సంఖ్య 21 కోట్లు దాటింది. పదేళ్ల క్రితం సుమారు రెండు వేల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించారు. ఇప్పుడు ఏటా 12 లక్షలు అమ్ముడవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్యాసింజర్ వాహనాల్లో దాదాపు 60 శాతం వృద్ధి నమోదైంది’ అని ప్రధాని మోదీ తెలిపారు. స్థానికంగా లభ్యమయ్యే ముడి పదార్థాలను ఉపయోగించి బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని వాహనరంగ పరిశ్రమకు పిలుపునిచ్చారు.

వాహన బీమా.. అనుబంధాలతో అదనపు రక్ష

మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్‌ పురోగమిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ‘నిర్మాణాల విషయంలో మేం సముద్రాలు, పర్వతాలకు సవాలు విసురుతున్నాం. రికార్డు సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నాం. అటల్ టన్నెల్ (హిమాచల్‌ప్రదేశ్‌) నుంచి అటల్ సేతు (ముంబయి) వరకు దేశ మౌలిక సదుపాయాల రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గత పదేళ్లలో 75 కొత్త విమానాశ్రయాలు, సుమారు 4 లక్షల గ్రామీణ రహదారులు నిర్మించాం’’ అని వివరించారు. ఇదిలా ఉండగా.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు భాజపా సారథ్యంలోని ఎన్డీయే శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని