Twitter: ‘ట్విటర్‌ సీఈవో పదవికి నేను రెడీ’ ట్వీట్ చేసిన భారతీయ అమెరికన్‌

ట్విటర్‌ సీఈవో పదవిపై తనకు ఆసక్తి ఉందని భారత సంతతి అమెరికన్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తనను తాను ఈ-మెయిల్ ఆవిష్కర్తగా పరిచయం చేసుకున్న శివ అయ్యదురై అనే వ్యక్తి ఈ ట్వీట్ చేశారు. 

Published : 27 Dec 2022 22:22 IST

న్యూయార్క్‌: ట్విటర్‌ (Twitter) సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తం అవుతుండటంతో, తాను ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ట్విటర్‌కు కొత్త సీఈవో కోసం అన్వేషిస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సీఈవో పదవికి భారత సంతతి అమెరికన్‌ ఒకరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఈవో పదవిపై తన ఆసక్తిని తెలియజేస్తూ శివ అయ్యదురై అనే వ్యక్తి మస్క్‌కు ట్వీట్‌ చేశారు. 

‘‘ డియర్‌ మస్క్‌, ట్విటర్‌ సీఈవో పదవిపై నాకు ఆసక్తి ఉంది. నేను ఎంఐటీ నుంచి నాలుగు డిగ్రీ పట్టాలను అందుకున్నాను. ఏడు హైటెక్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలను నెలకొల్పాను. ట్విటర్‌ సీఈవో పదవికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేయండి’’ అని శివ అయ్యదురై ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్‌ చివరల్లో తనను తాను ఈ-మెయిల్‌ ఆవిష్కర్తగా పేర్కొన్నారు. శివ ట్వీట్‌పై మస్క్‌ స్పందించాల్సివుంది.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘ఆల్‌ ది బెస్ట్‌’, ‘మీరు విద్యార్హతలు ప్రస్తావించారు కాబట్టి, మీ దరఖాస్తును మస్క్‌ తిరస్కరించవచ్చు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయ్యదురై కంటే ముందు ట్విటర్‌ సీఈవో పదవిపై తనకు ఆసక్తి ఉందని ప్రముఖ యూట్యూబర్‌ మిస్టర్‌బీస్ట్ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

శివ అయ్యదురై 1963లో ముంబయిలో తమిళ కుటుంబంలో జన్మించాడు. తన ఏడేళ్ల వయసులో అతని కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది.  ఎంఐటీ నుంచి పీహెచ్‌డీ పట్టాతోపాటు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, విజువల్స్‌ స్టడీస్‌, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి పలు విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పట్టాలను అందుకున్నారు. 1978 ఈ-మెయిల్‌ అనే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను అయ్యదురై డెవలప్‌ చేశాడు. ఇందులో ప్రస్తుతం అందరూ ఉపయోగిస్తున్న ఈ-మెయిల్‌లో మాదిరే ఇన్‌బాక్స్‌, అవుట్‌బాక్స్‌, ఫోల్డర్స్‌, మెమో, అటాచ్‌మెంట్స్‌, అడ్రస్‌బుక్‌ వంటి పీచర్లు ఉన్నాయి. అయ్యదురై కంటే ముందే ఈ-మెయిల్ ఫీచర్లను తాము అందించామని అర్పానెట్‌ అనే రీసెర్చ్ కమ్యూనిటీ పేర్కొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని