Education Loan: విద్యా రుణంపై బీమా తీసుకోవాలా? ఎలా పనికొస్తుంది?

పెద్ద మొత్తంలో విద్యా రుణం తీసుకున్నప్పుడు..చెల్లింపుల భారం తల్లిదండ్రులపై పడకుండా బీమా కవరేజీ పొందడం అవసరం. 

Updated : 15 Nov 2022 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటారు. అయితే, ఇందుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థుల కలలు చెదిరిపోకుండా బ్యాంకులు విద్యా రుణంతో సాయం చేస్తున్నాయి. అలా పెద్ద మొత్తంలో విద్యా రుణం తీసుకున్నప్పుడు దానిపై బీమా కవరేజీ పొందడం కూడా ముఖ్యం. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

తల్లిదండ్రులపై భారం పడకుండా..

విద్య పూర్తిచేసుకుని, ఉద్యోగంలో చేరిన తర్వాత రుణం తీర్చాల్సిన బాధ్యత దరఖాస్తుదారుడైన విద్యార్థిపైనే ఉంటుంది. కానీ విదేశాల్లో విద్యకు అధిక మొత్తంలో డబ్బు అవసరం కాబట్టి బ్యాంకులు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు/గార్డియన్‌ను సహ-దరఖాస్తుదారునిగా చేరుస్తాయి. అనుకోకుండా విద్యార్థికి ఏదైనా జరిగితే.. ఆ భారం సహ దరఖాస్తుదారునిపై పడకుండా బీమా సాయపడుతుంది.

ఎలాంటి సందర్భంలో బీమా వర్తిస్తుంది?

ఏదైనా ప్రమాదం లేదా ప్రాణాంతక వ్యాధి కారణంగా దరఖాస్తుదారు మరణించినప్పుడు లేదా దరఖాస్తుదారు తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు బీమా సంస్థ రుణ మొత్తాన్ని చెల్లిస్తుంది. విద్యార్థి ఉపాధి కోల్పోయినప్పుడు కూడా కొన్ని బీమా పాలసీలు రుణ బాధ్యత వహిస్తాయి. అయితే, ఇది విద్యార్థి తీసుకున్న రుణ బీమా రకంపై ఆధారపడి ఉంటుంది.

సహ-దరఖాస్తుదారునికి వర్తిస్తుందా?

సహ-దరఖాస్తుదారుడి విషయంలో విద్యా రుణ బీమా వర్తించదు. కేవలం దరఖాస్తుదారుడు చెల్లించలేని పరిస్థితుల్లో ఆ భారం సహ-దరఖాస్తుదారునిపై పడకుండా మాత్రమే రక్షణ కల్పిస్తుంది. 

బ్యాంకులు అడుగుతాయా?

విదేశీ విద్యకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కాబట్టి బ్యాంకులు సహ-దరఖాస్తుదారుని చేర్చుతాయి. సెక్యూరిటీ కోసం ఆస్తిని కూడా అడగొచ్చు. అలా కాకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రుణం ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలు విద్యా రుణం భద్రత కోసం బీమా చేయమని అడగొచ్చు. కొన్ని బ్యాంకులు విద్యా రుణంతో పాటు బీమాను తీసుకుంటే.. వడ్డీని నిర్దిష్ట శాతం వరకు మాఫీ చేస్తుంటాయి. ఇది చాలా మంది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 

ప్రీమియం..

విదేశీ విద్యా రుణంపై బీమా తీసుకున్నప్పుడు ప్రీమియంను చెల్లించలేమని బీమా కొనుగోలును పక్కన పెడుతుంటారు. అయితే, బీమా కోసం ప్రీమియంలను విడిగా చెల్లించవనసరం లేదు. విద్యారుణం కోసం చెల్లించే ఈఎంఐలోనే ప్రీమియం మొత్తం చేర్చుతారు. 

ఇవీ తీసుకోవడం మంచిది..

విద్యనభ్యసించడం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు విద్యా రుణ బీమాతో పాటు, ఆరోగ్య బీమా, స్టూడెంట్‌ ట్రావెల్‌ బీమాను తీసుకోవడం మంచిది. చాలా దేశాల్లో వైద్యం ఖర్చుతో కూడుకుని ఉంటుంది. సరైన బీమా లేకుండా ఈ ఖర్చులను భరించడం కష్టం. విదేశాలకు వెళ్లిన వెంటనే ఆ దేశ పాలసీలు మీకు అందకపోవచ్చు. కాబట్టి, ఇలాంటి ఖర్చులను కవర్‌ చేసేలా భారత్‌లోనే ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. అలాగే ట్రావెల్‌ సమయంలో కూడా లగేజీ పోవడం, ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాటి కోసం ప్రయాణ బీమాను తీసుకోవడం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు