IRCTC ఇ-వ్యాలెట్‌తో క్షణాల్లో టికెట్‌ బుకింగ్‌.. దీని గురించి తెలుసా?

IRCTC eWallet Full details: భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రయాణికుల సౌకర్యం కోసం ఇ-వ్యాలెట్‌ను అందిస్తోంది. దీని ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Updated : 30 Mar 2023 09:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రైలు టికెట్‌ బుక్ (Train Ticket) చేయడమంటేనే ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. పక్కా ప్రణాళిక ఉండీ నెలల ముందు టికెట్‌ బుక్‌ చేసుకునే వారికి పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎటొచ్చీ తత్కాల్‌లోనో, కొన్ని గంటల ముందో టికెట్‌ బుక్‌ చేయాలంటేనే అసలు సమస్య. అదే సమయానికి బ్యాంక్‌ సర్వర్‌ మొరాయిస్తే ఇక అంతే సంగతులు. టికెట్లు ఉన్నా బుక్‌ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఒక్కోసారి ప్రయాణానికి కొన్ని గంటల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేయాల్సి రావొచ్చు. అలా చేసినా డబ్బులు వెనక్కొచ్చేది కొన్ని రోజుల తర్వాతనే. ఇలాంటి అవాంతరాలకు ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌ ద్వారా చెక్‌ పెట్టొచ్చు. రైలు ప్రయాణికులు టికెట్‌ బుకింగ్‌ చేసుకోవటాన్ని సులభతరం చేసేందుకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఇ-వ్యాలెట్‌ను (IRCTC eWallet) అందిస్తోంది.

ఎక్కువ మంది టికెట్‌ బుకింగ్‌ సమయంలో బ్యాంక్‌ సర్వర్‌ డౌన్‌ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో టికెట్‌ బుక్‌ అవ్వడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. వీటికి ఐర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌ ఫుల్‌స్టాప్‌ పెడుతుంది. ముఖ్యంగా తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ సమయంలో క్షణాల్లో టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి ఇ- వ్యాలెట్‌ ఉపయోపడుతుంది. సాధారణంగా రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బు అకౌంట్‌లో జమ అవుతుంది. అంటే మన డబ్బులు ఐఆర్‌సీటీసీ దగ్గర కొన్ని రోజులు లాక్‌ అయినట్లే. ఈ లోగా మరో టికెట్ చేసుకోవాలంటే మళ్లీ మన దగ్గర డబ్బులనే వాడుకోవాలి. అదే ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌ నుంచి బుక్‌ చేసిన టికెట్లు క్యాన్సిల్‌ చేస్తే వెంటనే వ్యాలెట్‌లో డబ్బు జమవుతుంది.

ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్‌కు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత అకౌంట్‌ను రెన్యువల్‌ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. ఇ-వ్యాలెట్‌ను తెరవాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. IRCTC eWallet మోనూలో Register Nowపై క్లిక్‌ చేయాలి. అందులో మీ ఆధార్‌, పాన్‌ కార్డ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఇ-వ్యాలెట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రూ.50 చెల్లించాలి. దీంతో మీ రిజిస్ట్రేషన్‌ విజయవంతమైనట్టు మీకు మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆపై ఇ-వ్యాలెట్‌లోకి మీకు కావాల్సినంత అమౌంట్‌ లోడ్‌ చేసుకోవచ్చు. దీనికోసం ‘IRCTC eWallet’ మెనూలో ‘IRCTC eWallet Deposit’ పై క్లిక్‌ చేయాలి. కనిష్ఠంగా రూ.100 గరిష్ఠంగా రూ.10,000 వరకు జమ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని రైల్వేలో టికెట్‌ కొనుగోలు సమయంలో వినియోగించుకోవచ్చు. ఇ-వ్యాలెట్‌కు పాస్‌వర్డ్‌ ఉంటుంది. దీన్ని టికెట్‌ బుకింగ్‌ పేమెంట్‌ సమయంలో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని