Jack Ma: ‘మా కిచెన్‌ ఫుడ్‌’.. కొత్త కంపెనీ ప్రారంభించిన జాక్‌ మా

Jack Ma: అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా మరో కొత్త కంపెనీని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్న ఆయన తన అభిరుచికి అనుగుణంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారంలోకి ప్రవేశించారు.

Published : 27 Nov 2023 15:56 IST

బీజింగ్‌: చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ‘జాక్‌ మా’ (Jack Ma) మరో కొత్త బిజినెస్‌ను ప్రారంభించారు. తద్వారా ఆయన తన భవిష్యత్‌ ప్రణాళికలేంటో పరోక్షంగా వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి విక్రయించే ఒక చిన్న కంపెనీని ప్రారంభించారు. 1.4 మిలియన్‌ డాలర్ల మూలధనంతో దీన్ని రిజిస్టర్ చేయించారు.

‘హాంగ్జౌ మా కిచెన్‌ ఫుడ్‌’ పేరిట ఈ కంపెనీని జాక్‌ మా (Jack Ma) ప్రారంభించారు. ఇది  ప్యాకేజ్డ్‌ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించనున్నట్లు చైనా నేషనల్‌ ఎంటర్‌ప్రైజ్‌ క్రెడిట్ ఇన్ఫర్మేషన్‌ పబ్లిసిటి సిస్టమ్ సమాచారం ద్వారా తెలుస్తోంది. ‘జాక్‌ మా ఫౌండేషన్‌’లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులే కొత్త కంపెనీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది. భవిష్యత్‌లో ఈ కంపెనీ ‘రెడీ మీల్స్‌’ బిజినెస్‌లోకీ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం చైనాలో వేగంగా విస్తరిస్తోంది.

జాక్‌ మా (Jack Ma) గత కొన్నేళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాలు ఎత్తిచూపుతూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాపారాలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఆయన నేతృత్వంలోని అలీబాబా, యాంట్ గ్రూప్‌ కంపెనీలపై దర్యాప్తుల పేరిట ఆంక్షలు విధించింది.

అప్పటి నుంచి జాక్‌ మా (Jack Ma) ప్రజా జీవితం నుంచి దూరమయ్యారు. ఎక్కువ సమయాన్ని ఆయన తన ఫౌండేషన్‌ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఆయన వ్యక్తిగత ఆసక్తి అయిన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పరిశోధనలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో వివిధ వ్యవసాయ పద్ధతులను పరిశీలించేందుకు ఆయా దేశాల్లో పర్యటించారు. తాజాగా ప్రారంభించిన కంపెనీ కూడా ఆయన అభిరుచుల్లో భాగమేననే వాదన వినిపిస్తోంది. తద్వారా ఇకపై ఆయన పూర్తిగా తన సమయాన్ని వ్యవసాయ ఆధారిత వ్యాపారంపైనే వెచ్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని