Rakesh Jhunjhunwala: బిలియనీర్‌గా ఎదిగినప్పటికీ.. ఆ విషయంలో సిగ్గుపడాలన్నారు

బిలియనీర్‌గా ఎదిగినప్పటికీ ఒక విషయంలో మాత్రం సిగ్గుపడాలని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఝున్‌ఝున్‌వాలా పలు వేదికలపై గుర్తుచేసుకున్నారు.

Updated : 16 Aug 2022 15:16 IST

తండ్రి చెప్పిన మాటలపై రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

దిల్లీ: భారత్‌లో దిగ్గజ ఇన్వెస్టర్‌గా పేరుగాంచిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. సాధారణ కుటుంబం నుంచి బిలియనీర్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్న బిలియనీర్‌గా ఎదిగినప్పటికీ.. ఒక విషయంలో మాత్రం సిగ్గుపడాలని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఝున్‌ఝున్‌వాలా పలు వేదికలపై గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా, ఎంత సంపాదించినా.. మరణం తర్వాత తమతో ఏమీ తీసుకుపోమని ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డబ్బును తీసుకెళ్లలేం..

‘జీవితంలో ఎంతో డబ్బు సంపాదించిన తర్వాత నేనొక విషయం గుర్తించాను. సంపాదనతో ఏదీ ఆగిపోదు. దాన్ని కొంతమంది ఇష్టపడతారు.. దానికోసం కొందరు చస్తారు.. మరికొందరు సక్రమంగా వినియోగిస్తారు.. కొందరు వృథా చేస్తారు. ఇలా డబ్బుకోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తూనే ఉంటారు. డబ్బుతో ఎంతో మంచి చేయొచ్చు. కానీ, డబ్బు విషయంలో ఒక చెడు అంశమేమిటంటే..చనిపోయిన తర్వాత దాన్ని మనతో తీసుకెళ్లలేం. డబ్బు అంటే సంపద.. సంపద అంటే అధికారం..’ అంటూ 2012లో ముంబయిలోని అమెరికా కాన్సులేట్‌ ఏర్పాటు చేసిన EVOKE సెమినార్‌లో మాట్లాడిన ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala).. మధ్యతరగతి నుంచి బిలియనీర్‌గా ఎదిగిన తీరును వివరిస్తూనే సంపద గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.

‘‘నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. యుక్తవయసులో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది ధనిక మిత్రులు ఉండేవారు. అప్పుడు మా నాన్న చెబుతుండేవారు.. ‘ఎల్లప్పుడూ ఆకాంక్షించు.. కానీ, ఎన్నడూ అసూయ పడకు’ అని. సంపన్నులను చూసినప్పుడు వారికంటే ఎక్కువ సంపాదించడానికి కష్టపడాలి కానీ.. అసూయ చెందకూడదు. ఎందుకంటే అది పగ, ఘర్షణలకు మాత్రమే దారితీస్తుందని నాన్న రాధేశ్యామ్‌జీ ఝున్‌ఝున్‌వాలా (Radheshyamji) నన్ను హెచ్చరించేవారు’’

ఆ విషయానికి సిగ్గుపడాలి..

‘‘నా తండ్రి జీవించినంతకాలం ఆయనతోనే గడిపేవాడిని. ఆయన మాత్రం ఎన్నడూ నా ఇంట్లో ఉండలేదు. విరాళం ఇవ్వడాన్ని తండ్రి నుంచే నేర్చుకున్నా. మన తలుపు తట్టి వచ్చిన వారికి ఆర్థికంగా సహాయం చేయాలని సూచించేవారు. నా సంపద గురించి ఆయన ఎన్నడూ ప్రశ్నించలేదు. కానీ, ఆ సంపాదనంతా ఎలా ఖర్చు చేస్తానన్న విషయంపైనే ఆయన ఆందోళన చెందేవారు. బిలియనీర్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో నా పేరును చూసి ఎంతో సంతోషించారు. అదే సమయంలో ‘వేల కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ దాతృత్వానికి కొన్ని డాలర్లు కూడా ఖర్చుపెట్టకపోవడంపై నా కుమారుడు సిగ్గుపడాలి’’ అంటూ తండ్రి చెప్పిన విషయాలను రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) స్వయంగా వెల్లడించారు.

అవసరం కంటే ఎక్కువ ధనం.. కానీ ఏం లాభం

‘‘ఎంతోమంది ధనవంతుల కంటే తాను తక్కువ సంపన్నుడనే అయినప్పటికీ.. నాకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదే ఉంది. యాభై ఏళ్ల వయసున్న (2012లో) నాకు ఆయుర్దాయం కూడా తక్కువే. రోజుకు 25 సిగరెట్లు, ఆరు పెగ్గుల విస్కీ, వ్యాయామం లేకుండా, నియంత్రణ లేని తిండి కారణంగా నాలాంటి వారికి ఆయుష్షు తక్కువే ఉంటుంది. గడిచిన 25 ఏళ్లు డబ్బు సంపాదన కోసమే రాత్రింబవళ్లు కష్టపడ్డా.. ఇప్పుడు అది నాకు ఏం చేసి పెడుతుంది..?’’ అంటూ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని