LIC results: ఎల్‌ఐసీ లాభంలో 50 శాతం క్షీణత

LIC Q2 results: ఎల్‌ఐసీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికర లాభం 50 శాతం మేర క్షీణించింది. ఆదాయం సైతం తగ్గింది. 

Updated : 10 Nov 2023 19:11 IST

LIC Q2 results | దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) నిరుత్సాహకర త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.7,925 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే నికర లాభం 50 శాతం మేర క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.15,952 కోట్లుగా నమోదైనట్లు ఎల్‌ఐసీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రీమియం ఆదాయం తగ్గడంతో లాభం తగ్గుముఖం పట్టింది.

ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం, మొత్తం ఆదాయంలో సైతం క్షీణత నమోదైంది. గతేడాది రూ.1.32 లక్షల కోట్లుగా ఉన్న ప్రీమియం వసూళ్లు రూ.1.07 లక్షల కోట్లకు తగ్గాయి. మొత్తం ఆదాయం రూ.2.22 లక్షల కోట్ల నుంచి రూ.2.01లక్షల కోట్లకు తగ్గింది. కంపెనీ స్థూల ఎన్‌పీఏలు 5.60 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గాయి. సమీక్షా త్రైమాసికంలో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.9,142 కోట్ల నుంచి రూ.9,988 కోట్లకు పెరిగాయి. పెట్టుబడులపై ఆదాయం రూ.84 వేల కోట్ల నుంచి రూ.93 వేల కోట్లకు పెరిగింది. 

ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్‌.. అకౌంట్లోకి PF వడ్డీ

ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి తొలి ఆరు నెలల్లో న్యూ బిజినెస్ ద్వారా రూ.3,304 కోట్లు వచ్చింది. గతేడాదితో ఇదే కాలంలో రూ.3,677 కోట్లు ఎల్‌ఐసీకి వచ్చింది. గతేడాది తొలి ఆరు నెలల్లో మొత్తం 83.59 లక్షల పాలసీలను ఎల్‌ఐసీ విక్రయించగా.. ఈ ఏడాది 80.60 లక్షల పాలసీలను విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 0.81 శాతం క్షీణించి రూ.609.80 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని