Indian Economy: ‘ఓవర్‌వెయిట్‌’లో భారత్‌.. మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌

భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు కనబరిచేందుకు సిద్ధంగా ఉందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. దీంతో మన దేశ రేటింగ్‌ను పెంచింది.

Published : 03 Aug 2023 12:14 IST

దిల్లీ: ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థల రేటింగ్‌లలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley)’ కీలక మార్పులు చేసింది. భారత్‌ (India) రేటింగ్‌ను మరింత మెరుగుపర్చి ‘ఓవర్‌వెయిట్‌ (Overweight)’గా పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ (Economy)లో సంస్కరణల అజెండా మూలధన వ్యయాలు, లాభాల విషయంలో సానుకూల దృక్పథంలో పయనిస్తోందని మోర్గాన్‌ స్టాన్లీ ఈ సందర్భంగా భారత్‌పై విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక ఇదే సమయంలో చైనా (China) రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’కు కుదించింది.

‘‘సంస్కరణలు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత్‌ కట్టుబడి ఉంది. దీంతో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు, పోర్ట్‌ఫోలియోలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు, యువ జనాభా మరింత ఉపయోగపడుతున్నాయి. దీర్ఘకాల అభివృద్ధి దిశగా భారత్‌ అడుగులు వేయడం ప్రారంభించింది’’ అని మోర్గాన్‌ స్టాన్లీ తన నివేదికలో వెల్లడించింది. భారత స్థూల ఆర్థిక వ్యవస్థ సూచీలు స్థిరంగా ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ 6.2శాతం వృద్ధి అంచనాలను అందుకునే దిశగా పయనిస్తోందని పేర్కొంది.

శాంసంగ్‌ కోటి రుపాయల టీవీ.. ఫీచర్లివే..

కొద్ది నెలల క్రితమే మోర్గాన్‌ స్టాన్లీ (Morgan Stanley) భారత రేటింగ్‌ను ‘అండర్‌వెయిట్‌’ నుంచి ‘ఈక్వల్‌ వెయిట్‌’కు పెంచగా.. తాజాగా దాన్ని మరింత పెంచి ‘ఓవర్‌వెయిట్‌’ కేటగిరిలోకి చేర్చింది. చైనాలో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటం, అమెరికా రుణ రేటింగ్‌ను ఫిచ్‌ తగ్గించిన సమయంలో మోర్గాన్‌ స్టాన్లీ భారత రేటింగ్‌ పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఓవర్‌వెయిట్‌’ రేటింగ్‌ అంటే.. భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు కనబర్చేందుకు సిద్ధంగా ఉందని.. అంచనా వేస్తూ మోర్గాన్‌ స్టాన్లీ ఈ రేటింగ్‌ ఇస్తుంది.

ఇక చైనా రేటింగ్‌ను మోర్గాన్‌ స్టాన్లీ ‘ఈక్వల్‌ వెయిట్‌’కు తగ్గించింది. చైనా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో అక్కడి మార్కెట్లు ఊపందుకున్నాయని, అందువల్ల మదుపర్లు అప్రమత్తంగా ఉండి.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపాలని ఈ నివేదిక సూచించింది. చైనా ఉద్దీపన చర్యలు దశల వారీగా ఉంటాయని, మార్కెట్లలో లాభాలను కొనసాగించేందుకు అవి సరిపోకపోవచ్చని అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు