EPFO: వ్యక్తిగత వివరాల్లో ఇక వేగంగా సవరణలు

EPF accounts updation: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చందాదారుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరిచేసేందుకు ఈపీఎఫ్‌వో నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

Updated : 31 Aug 2023 12:38 IST

కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిన ఈపీఎఫ్‌వో
గరిష్ఠంగా 15 రోజుల్లో దరఖాస్తుల పరిష్కారం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరిచేసేందుకు ఈపీఎఫ్‌వో (EPFO) నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈమేరకు.. ‘తండ్రి పేరు ‘ఎక్స్‌’ అని ఉంది.. డేటాబేస్‌లో ఉన్నపేరు, దరఖాస్తులోని చందాదారుడి, తండ్రి పేరు సరిపోలడం లేదు.. ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టారు..’ ఇలాంటి కారణాలతో ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల తిరస్కారానికి అడ్డుకట్ట వేయనుంది. బ్యాంకులకు ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాలను ఈపీఎఫ్‌వోకు అమలుచేస్తూ ఈ-కేవైసీని అందుబాటులోకి తీసుకువచ్చింది. చందాదారుడు వ్యక్తిగత వివరాలను ఒకటి కన్నా ఎక్కువసార్లు మార్చేందుకు వీల్లేకుండా కఠిన ఆంక్షలు పెట్టింది. వ్యక్తిగత వివరాల్లో సవరణల పేరిట మోసాలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా దరఖాస్తు కేటగిరీ ఆధారంగా చిన్న సవరణల్ని వారం రోజుల్లో.. పెద్ద సవరణల్ని 15 రోజుల్లోగా పరిష్కరించాలని గడువు విధించింది. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈపీఎఫ్‌ ఖాతాలో వ్యక్తిగత వివరాల సవరణ కోసం చందాదారులు ప్రతిరోజూ ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో కాగితరూపంలోని వివరాలు డేటాబేస్‌లోకి సరిగా నమోదు కాకపోవడం, ప్రస్తుతం యూఏఎన్‌లోని వివరాలు సరిపోలకపోవడంతో క్లెయిమ్‌లు తిరస్కారానికి గురవుతున్నాయి. ఖాతా నుంచి నగదు తీసుకోవాలన్నా, పదవీ విరమణ తరువాత నిల్వలు ఉపసంహరించాలన్నా, చివరకు పింఛను కోసం దరఖాస్తు చేయాలన్నా ఏదో ఒక కారణంతో దరఖాస్తులు వెనక్కు వస్తున్నాయి. దీంతో వ్యక్తిగత వివరాల సవరణ కోసం ఉద్యోగులు సంబంధిత యజమానితో సంతకం చేయించి, ప్రాంతీయ కార్యాలయాల్లో జాయింట్‌ డిక్లరేషన్లు అందజేస్తున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులపై ఈపీఎఫ్‌వో వెంటనే చర్యలు తీసుకోకపోవడం, దరఖాస్తు పరిష్కారానికి కచ్చితమైన గడువు లేకపోవడంతో చందాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు మరింత పారదర్శక సేవలకు గాను నూతన విధానాన్ని తీసుకువచ్చింది. వివరాలివీ..

  • చందాదారుల పేరు, స్త్రీ/పురుషుడు, పుట్టినతేదీ, తండ్రి/తల్లి పేరు, బంధుత్వం, వివాహస్థితి, చందాదారులుగా చేరిన తేదీ, ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం, ఉద్యోగం వదిలిపెట్టిన తేదీ, జాతీయత, ఆధార్‌ నంబరు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • వివాహస్థితి ఒక్కటి మాత్రమే రెండుసార్లు సవరణ చేయవచ్చు. మిగతా వివరాలన్నీ ఒకసారి మాత్రమే సవరిస్తారు. ఏదేని అత్యవసర పరిస్థితుల్లో ఒకటికి మించి సవరణ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రాంతీయ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు.
  • వ్యక్తిగత వివరాల సవరణ దరఖాస్తులను రెండు కేటగిరీలుగా విభజించింది. ఉదాహరణకు పేరులో రెండు అక్షరాల్లోపు, ఇంటిపేరు సరిచేయడం, వివాహం తరువాత మహిళ ఇంటిపేరు మార్పు వంటివాటిని చిన్న సవరణలుగా చూస్తుంది. అంతకన్నా ఎక్కువైనా, పూర్తిపేరు నమోదు, పుట్టిన తేదీ మూడేళ్లకన్నా ఎక్కువగా సరిచేయడం తదితర అంశాలను పెద్ద సవరణగా లెక్కిస్తుంది. పెద్ద సవరణలపై సంబంధిత అధీకృత అధికారి పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
  • చిన్న సవరణల ఆధారాలకు సంబంధించి రెండు ధ్రువీకరణ పత్రాలు, పెద్ద సవరణలకు మూడు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. యూనిఫైడ్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసినపుడు ఆ దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. ఆ తరువాత దరఖాస్తు యజమాని లాగిన్‌లోకి వెళుతుంది.
  • వ్యక్తిగత వివరాల సవరణల్ని సకాలంలో ఆమోదించకుంటే చందాదారులు ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక కేటగిరీ సిద్ధం చేసింది. ఆధార్‌ లేకుండా ఎవరైనా చందాదారుడు చనిపోతే వారసుడు/నామినేషన్‌ ఇవ్వకుంటే కుటుంబ సభ్యులు లేదా వారసులు చందాదారుడి వ్యక్తిగత వివరాల్లో మార్పులకు జాయింట్‌ డిక్లరేషన్‌ ఇవ్వవచ్చు.
  • మూసివేసిన పరిశ్రమల్లో పనిచేసిన కార్మికుల జాయింట్‌ డిక్లరేషన్‌ క్లెయిమ్‌లను ఈ కింది అధికారులు ధ్రువీకరించవచ్చు. మేజిస్ట్రేట్‌, గెజిటెడ్‌ అధికారి, పోస్టుమాస్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే, నగరపాలిక, మున్సిపాలిటీల సభ్యులు, ఈపీఎఫ్‌ సీబీటీ ట్రస్టీలు, ఈపీఎఫ్‌ ప్రాంతీయ కమిటీ, బ్యాంకు మేనేజర్‌, గుర్తింపు పొందిన విద్యాసంస్థల విభాగాధిపతి, గ్రామ పంచాయతీ అధిపతి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో, తహసీల్దారు లేదా ఈపీఎఫ్‌ కమిషనర్‌ గుర్తించిన ఇతర అధికారులు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని