Recession: భారత్‌లో ఆర్థికమాంద్యానికి అవకాశం లేదు.. నీతిఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌

భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌లో 6-7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్నారు.

Updated : 20 Nov 2022 12:47 IST

దిల్లీ: భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌-ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 2023-24లో దేశం 6-7 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకున్నా భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు.

అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆయా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకుంటుందన్నారు. కానీ, భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదన్నారు. అయితే, వృద్ధిరేటుపై మాత్రం కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చన్నారు. అయినప్పటికీ 2023- 24లో 6-7 శాతం వృద్ధి నమోదవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం మరికొంత కాలం 6-7 శాతం మధ్య ఉంటుందన్నారు. తర్వాత క్రమంగా కిందకు దిగొస్తుందన్నారు. ధరల పెరుగుదల ముఖ్యంగా చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు.

రూపాయి పతనంపై స్పందిస్తూ.. భారత్‌లో దిగుమతి చేసుకున్న వస్తు- సేవలను సామాన్యులు ఎక్కువగా ఉపయోగించరని తెలిపారు. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనపడడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదన్నారు. వాణిజ్య లోటు అక్టోబరులో భారీగా పెరిగిన నేపథ్యంలో.. ఎగుమతుల్ని పెంచే దిశగా భారత్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలవారీగా ఎగుమతి విధానాల్ని రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో యావత్తు దేశానికి ఒకే పాలసీ ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని