NPS కొత్త రూల్‌.. ఇకపై పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ తప్పనిసరి!

NPS: ఎన్‌పీఎస్‌ నిధుల ఉపసంహరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం పీఎఫ్‌ఆర్‌డీఏ ఇకపై పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ను తప్పనిపరి చేసింది. మరి ఈ పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ అంటే ఏంటో చూద్దాం..!

Published : 30 Oct 2023 12:18 IST

NPS new rule | ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS)’ చందాదారులకు సరైన సమయంలో, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిధులు జమయ్యేలా ‘పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA)’ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతా వివరాల తక్షణ తనిఖీని తప్పనిసరి చేసింది. పెన్నీ డ్రాప్ (Penny drop) పద్ధతి  ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

ఏంటీ పెన్నీ డ్రాప్‌ పద్ధతి?

ఎన్‌పీఎస్‌ (NPS) చందాదారుల పొదుపు ఖాతా స్థితి, వివరాలను తనిఖీ చేయడానికి ‘సెంట్రల్‌ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీ (CRA)’లు ఉపయోగించే పద్ధతినే ‘పెన్నీ డ్రాప్‌ (Penny drop)’ వెరిఫికేషన్‌ అంటారు. మీ ‘పర్మనెంట్ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (PRAN)’ లేదా సమర్పించిన ఇతర పత్రాల్లో ఉన్న వివరాలు.. బ్యాంకు ఖాతాలో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. ఎన్‌పీఎస్‌, అటల్‌ పెన్షన్‌ యోజన, ఎన్‌పీఎస్‌ లైట్‌ చందాదారులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. ఎన్‌పీఎస్‌ నుంచి పాక్షిక నిధుల ఉపసంహరణ, ఎన్‌పీఎస్‌ నుంచి మధ్యలో వైదొలగడం, బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ పెన్నీ డ్రాప్‌ (Penny drop) పద్ధతి ద్వారా వివరాలను ధ్రువీకరించుకుంటారు.

ఏం చేస్తారు..

పెన్నీ డ్రాప్‌లో భాగంగా మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో.. లేదో.. తెలుసుకోవడానికి తొలుత ‘టెస్ట్‌ ట్రాన్సాక్షన్‌’ చేస్తారు. అంటే చిన్న మొత్తంలో డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అదే సమయంలో పేరు సహా ఇతర వివరాలు సరిపోలాయో.. లేదో.. చూస్తారు. సరళంగా చెప్పాలంటే ఎన్‌పీఎస్‌ (NPS) నిధులు జమ కావాలంటే బ్యాంకు ఖాతా కచ్చితంగా ఈ పెన్నీ డ్రాప్‌ (Penny drop) తనిఖీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా బ్యాంకు వివరాల్లో ఏమైనా మార్పులు జరిగాయో ముందే ధ్రువీకరించుకునే వెసులుబాటు ఏర్పడుతుంది.

విఫలమైతే..

పెన్నీ డ్రాప్‌ (Penny drop) వెరిఫికేషన్‌లో విఫలమైతే.. నిధుల ఉపసంహరణ, బ్యాంకు ఖాతా వివరాల మార్పు వంటి వాటి కోసం చేసుకున్న దరఖాస్తును పీఎఫ్‌ఆర్‌డీఏ (PFRDA) మధ్యలోనే నిలిపివేస్తుంది. అలాంటప్పుడు సీఆర్‌ఏలు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి పొరపాట్లను సరిదిద్దుకునేలా చందాదారులను అప్రమత్తం చేస్తాయి. అలాగే బ్యాంక్‌ ఖాతా పెన్నీ డ్రాప్‌ వెరిఫికేషన్‌ విఫలమైనట్లు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్‌ ద్వారానూ పీఎఫ్‌ఆర్‌డీఏ తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎన్‌పీఎస్‌ వద్ద సమర్పించిన పత్రాల్లోని వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలతో సరిపోలకపోవడంతో చందాదారులకు నిధులు జమ కావడం లేదు. దీన్ని నివారించడం కోసమే పీఎఫ్‌ఆర్‌డీఏ పెన్నీ డ్రాప్‌ పద్ధతి అమలు చేయాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని