Petrol price: సామాన్యుడి ఆశలకు సౌదీ, రష్యా గండి.. పెట్రో ధరల తగ్గింపు హుళక్కేనా?

గ్యాస్‌తో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ తగ్గుతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సౌదీ, రష్యా తీసుకున్న నిర్ణయం కారణంగా అంతర్జాతీయంగా మళ్లీ చమురు ధరలు పెరిగాయి.

Published : 07 Sep 2023 01:34 IST

దిల్లీ: గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను ప్రభుత్వం ఇటీవల రూ.200 తగ్గించడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. పనిలో పనిగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల (petrol, diesel price) భారం కూడా తగ్గిస్తారన్న ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ, రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఆశలు గండికొట్టినట్లయ్యింది. ఉత్పత్తిలో కోత విధిస్తూ ఆ రెండు దేశాలూ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ బ్రెంట్‌ క్రూడ్‌ (Brent crude) ధర 90 డాలర్లకు చేరింది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరల మార్పు ఇప్పట్లో ఉండబోదన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.

రోజుకు 1.3 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి కోతను ఈ ఏడాది చివరి వరకు పొడిగించేందుకు సౌదీ అరేబియా, రష్యాలు నిర్ణయించాయి. ఈ పరిణామంతో మంగళవారం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 90 డాలర్ల ఎగువకు వెళ్లింది. 2023లో బ్రెంట్‌ క్రూడ్‌ ఈ స్థాయి ఎగువకు వెళ్లడం ఇదే మొదటిసారి. బుధవారం క్రూడాయిల్‌ 89.67 వద్ద ట్రేడవుతోంది. ఆగస్టు నెలలో సగటున 86.43 డాలర్లుగా ఉన్న బ్యారెల్‌ ముడిచమురు ధర సెప్టెంబర్‌లో 89 డాలర్లకు చేరనుంది.

శాంసంగ్‌ ఆఫర్‌.. ఈ 2 ఫోన్లపై ఇంతకు ముందెన్నడూ లేనంత బిగ్‌ డిస్కౌంట్!

ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో సగటున 73-75 డాలర్ల వద్ద భారత్‌ ముడిచమురును దిగుమతి చేసుకుంది. జులైలో అది 80కి చేరగా.. తాజాగా అది 90 డాలర్లకు చేరింది. గతేడాది క్రూడాయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు నష్టాలు భరించిన ఆయిల్‌ కంపెనీలు.. ధరలు తగ్గిన తర్వాత లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెరిగిన ధరల కారణంగా ఖర్చుకు, రిటైల్‌ ధరల మధ్య వ్యత్యాసం ఏర్పడుతోంది.

సాధారణంగా అంతర్జాతీయ 15 రోజుల సగటు ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు సవరించేవి. 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు చమురు కంపెనీలు ధరల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. గతేడాది మే 22న చివరికి సారిగా కేంద్రం ఎక్సైజ్‌ సుంకం తగ్గించడంతో రిటైల్‌ రేట్లు దిగి వచ్చాయి. ఆ తర్వాత ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. ఈ నేపథ్యంలో బ్యారెల్‌ ధర 73-74 డాలర్ల మధ్య ఉంటే ఆయిల్‌ కంపెనీలు రోజువారీ ధరలను సవరించేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు రష్యా నుంచి చౌక ధర చమురు దిగుమతులూ తగ్గాయి. దీంతో చమురు ఊరట ఉండకపోవచ్చని సమాచారం. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ధరలు పెరిగే అవకాశం లేనప్పటికీ.. ధరలు తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని