Paytm Crisis: పేటీఎం ఉదంతంతో కంపెనీలకు నిబంధనల ప్రాముఖ్యత తెలిసొచ్చింది: రాజీవ్‌ చంద్రశేఖర్‌

Paytm Crisis: ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఫిన్‌టెక్‌ సంస్థలకు నియంత్రణాపరమైన నిబంధనల ప్రాముఖ్యత అర్థమైందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

Published : 18 Feb 2024 14:38 IST

దిల్లీ: ప్రతి కంపెనీ దేశ చట్టాలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. లేదంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో తాజా పేటీఎం (Paytm) ఉదంతమే ఉదాహరణ అని తెలిపారు. ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత ఫిన్‌టెక్‌ సంస్థలకు నియంత్రణాపరమైన నిబంధనల ప్రాముఖ్యత అర్థమైందన్నారు. ఏ కంపెనీ వీటి నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌పై (PPBL) ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశీయ- విదేశీ, చిన్న- పెద్ద.. ఇలా ఎలాంటి కంపెనీయైనా చట్టాలకు లోబడి పనిచేయాల్సిందేనని చంద్రశేఖర్‌ తెలిపారు. పీపీబీఎల్‌పై ఆంక్షల వల్ల ఫిన్‌టెక్‌ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే భావన సరైంది కాదన్నారు. అయితే, సంస్థలను నెలకొల్పే సమయంలో వ్యవస్థాపకులు పూర్తిగా వాటి లక్ష్యాలపైనే దృష్టి సారిస్తారని.. ఈ క్రమంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో చూసుకోకపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. పేటీఎం (Paytm) విషయంలోనూ అదే జరిగి ఉంటుందని తెలిపారు.

జనవరి 31న పేటీఎంపై ఆంక్షలు విధిస్తూ ఆర్‌బీఐ (RBI) ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు స్వీకరించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఇటీవల ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. పీపీబీఎల్‌ ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. పేటీఎం వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి ఆడిటర్లు పూర్తిస్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని