Paytm job cuts: పేటీఎంలో 1000 మంది ఉద్యోగులపై వేటు

Paytm job cuts: వ్యయ నియంత్రణలో భాగంగా వివిధ విభాగాల నుంచి దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం వర్గాలు తెలిపాయి.

Updated : 25 Dec 2023 13:08 IST

ముంబయి: ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది (Paytm job cuts). వ్యయ నియంత్రణ, వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో భాగంగా వివిధ విభాగాల నుంచి ఉద్యోగులను తీసివేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. రిటైల్‌ రుణాల జారీని తగ్గించుకోవడం, యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ‘ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి (BNPL)’ రుణాలను నిలిపివేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న తరుణంలో పేటీఎం (Paytm) నుంచి తొలగింపుల వార్త రావడం గమనార్హం.

వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించాలనే భారీ వ్యూహంలో ఉద్యోగుల తొలగింపు ఒక భాగమని పేటీఎం వర్గాలు తెలిపాయి. భవిష్యత్‌లో మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలూ ఉంటాయని పేర్కొన్నాయి. గత ఏడాది వ్యవధిలో గణనీయ వృద్ధి నమోదు చేసిన రుణ విభాగం నుంచే అత్యధిక తొలగింపులు ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఉద్యోగులపై చేస్తున్న వ్యయంలో 10-15 శాతం తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రూ.50,000 కంటే తక్కువ రుణాలను జారీ చేసే ‘పేటీఎం పోస్ట్‌పెయిడ్‌’ (Paytm Postpaid) విభాగాన్ని ‘వెల్త్‌ మేనేజ్‌మెంట్‌’గా మార్చే పనిలో పేటీఎం ఉంది. పోస్ట్‌పెయిడ్‌ లోన్‌ ప్లాన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్‌ 7న కంపెనీ స్టాక్‌ విలువ 20 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని