Financial Planning: ఈ ప్రాథమిక సూత్రాలతో జీవితానికి ఆర్థిక భరోసా!

మెరుగైన ఆర్థిక భవిత కోసం కొన్ని నిర్దిష్టమైన నియమాలను పాటించాలి. అవేంటో చూద్దాం..

Updated : 14 Sep 2022 13:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత ఆర్థిక విషయాలకు సంబంధించిన కొన్ని నిర్దిష్టమైన నియమాలను అర్థం చేసుకొంటే జీవితంలో డబ్బు నిర్వహణ చాలా సులభం. రోజువారీ జీవితం సాఫీగా సాగడానికి చాలా చోట్ల మనకు డబ్బు అవసరం. కాబట్టి దాన్ని చక్కగా వినియోగించుకొంటే జీవితంపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను విస్మరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి ప్రాథమిక విద్య స్థాయిలోనే దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఆర్థిక విషయాలను చర్చిస్తూ ఉండాలి. పిల్లలకు వాటి అవసరం వివరించాలి. మరి మెరుగైన ఆర్థిక భవిత కోసం పాటించాల్సిన కొన్ని నిర్దిష్ట నియమాలేంటో చూద్దాం..

ప్రారంభం పొదుపుతో..

వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మొట్టమొదటి నియమం పొదుపు. ఇది లేకపోతే మదుపు ఉండదు. ఫలితంగా సంపదను పోగు చేసుకోవడం సాధ్యం కాదు. మీ ఆదాయంలో ఖర్చులు 50 శాతానికి మించకుండా చూసుకోండి. మిగిలిన దాన్ని కచ్చితంగా పొదుపు చేయండి. కొంతకాలం తర్వాత దాంతో పెట్టుబడులు ప్రారంభించండి.

నియంత్రణ అవసరం..

ఆదాయం పెరుగుతున్నకొద్దీ మీ పొదుపు, మదుపునూ పెంచాలి. చిన్న వయసులోనే విలాస జీవితానికి అలవాటు పడి ఖరీదైన వస్తువులను కొనొద్దు. అలా అని వ్యక్తిగత సంతోషాన్ని ఫణంగా పెట్టాల్సిన పనిలేదు. కొంత వరకు నియంత్రణ ఉండాలి. పెరిగిన ఆదాయంలో 10 శాతాన్ని మీ సాధారణ ఖర్చులను జోడించుకుంటే సరిపోతుంది.

అత్యవసర నిధి..

సంపాదన ప్రారంభమైన తర్వాత నెమ్మదిగా కొంత మొత్తాన్ని అత్యవసర నిధి కోసం పక్కన పెట్టండి. అలా కనీసం 9 నుంచి 12 నెలలకు సరిపడా డబ్బును సమకూర్చుకోవాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ అవసరాలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. దీన్నుంచి ఎలాంటి రాబడి ఆశించొద్దు. రాబడి కంటే భద్రత ముఖ్యం.

ముప్పును తప్పించే మార్గాలు..

జీవితంలో ఊహించని ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రమాదవశాత్తూ ఆర్జించే వారికి ఏమైనా జరిగినా.. కుటుంబ సభ్యుల బాగోగుల కోసం జీవిత బీమా తీసుకోవాలి. హామీ మొత్తం వార్షిక ఆదాయానికి 15 రెట్లు ఉండేలా చూసుకోవాలి. పిల్లలు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు అవసరమయ్యే డబ్బు వారికి అందేలా బీమా ఉండాలి.

ఆరోగ్య అత్యవసరం..

ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కుటుంబం మొత్తానికీ సరిపోయే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి. స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటే మంచిది. వీటికి రైడర్లను కూడా జత చేసుకుంటే ఇంకా శ్రేయస్కరం.

అప్పును అర్థం చేసుకోవాలి..

అత్యవసరమైతే తప్ప అప్పు చేయొద్దు. రుణం తీసుకోవడానికి ముందు ఇతర మార్గాలన్నింటినీ అన్వేషించండి. తప్పనిసరైతేనే రుణానికి వెళ్లండి. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల వాటా 30 శాతానికి మించకుండా చూసుకోవాలి. అప్పు తీసుకున్నా.. మదుపు, పొదుపును కొనసాగించేలా చూసుకోవాలి.

బడ్జెట్‌ తయారీ..

వార్షిక, నెలవారీ బడ్జెట్‌లను తయారు చేసుకోండి. ఇందుకోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో యాప్‌లు, ఎక్సెల్‌ ఆధారిత బడ్జెట్‌ టూల్స్‌ ప్రయోజకరంగా ఉంటాయి. అత్యవసరం, అత్యవసరం కాని వస్తువులను గుర్తించి.. వాటికి అనుగుణంగా ఖర్చు చేయండి.

లక్ష్యం ఆధారిత మదుపు..

ఒక్కో లక్ష్యానికి ఒక్కో విధమైన మదుపు మార్గాన్ని అవలంబించాలి. ఉదాహరణకు మీ పిల్లల విదేశీ చదువుల కోసం డబ్బును పోగు చేయాలంటే.. బీమా ఆధారిత పథకాలు, లేదా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అదనపు ఖర్చులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మదుపును ప్రారంభించాలి.

పునఃసమీక్ష..

మనం చాలా మార్గాల్లో మదుపు చేసి వాటిని అలాగే కొనసాగిస్తూ పోతాం. ఇది సరైన విధానం కాదు. రోజురోజుకీ ఆర్థిక అంశాల్లో పలు మార్పులొస్తుంటాయి. ఎప్పటికప్పుడు మన మదుపు, రాబడిని సమీక్షించుకోవాలి. అంతకంటే మెరుగైన రిటర్న్స్‌ ఇచ్చే సాధనాలు ఉంటే వాటిలోకి మారాలి. అప్పుడే మారుతున్న రోజువారీ ఖర్చులకు అనుగుణంగా సంపదను సృష్టించుకోగలుగుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని