Tesla: టెస్లా భారత ప్రవేశం.. వచ్చేవారం పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ!

Tesla: భారత్‌లోకి ప్రవేశించేందుకు టెస్లా గతకొంత కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. తాజాగా భారత్‌ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో వచ్చేవారం మస్క్‌ భేటీ కానున్నారనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 09 Nov 2023 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) భారత ప్రవేశంపై ప్రచారం జోరందుకొంది. త్వరలోనే దేశీయ రోడ్లపై ఈ కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal)తో అమెరికాలో వచ్చేవారం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే జర్మనీలోని గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు కార్లను సరఫరా చేసేందుకు టెస్లా ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సమావేశమయ్యారు. భారత్‌లో గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మస్క్‌ తాజాగా గోయల్‌తో భేటీ కానుండటం ప్రాధాన్యం ఏర్పడింది. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు, దేశీయంగా పరికరాల కొనుగోలు, ఛార్జింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటుపైనే ప్రధానంగా వీరు చర్చించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దేశీయంగా కొంత వరకైనా తయారీ చేపట్టే కంపెనీలకు.. అవి దిగుమతి చేసుకొనే ఇతర మోడళ్లపై (కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌) సుంకాన్ని 15 శాతానికి తగ్గించడంపై కూడా మస్క్‌తో గోయల్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా విదేశాల్లో తయారై (కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌) భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. ఒకవేళ దేశీయంగా కొన్ని మోడళ్లనైనా తయారు చేసే కంపెనీలకు దిగుమతి సుంకంలో రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సరికొత్త ఈవీ విధానాన్ని (Eletric Vehicle policy) కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.

భారత్‌కు టెస్లా క్లార్లు.. వయా జర్మనీ

ఈ కొత్త ఈవీ విధానంపైనే ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే, దిగుమతి సుంకం తగ్గింపు వల్ల ఆ ప్రభావం దేశీయ ఈవీ కంపెనీలపై ఎలా ఉంటుందనే అంశాన్ని అంచనావేస్తున్నట్లు పేర్కొన్నారు. టెస్లా (Tesla) 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నాలు చేస్తోంది. అయితే, ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. దీనికి ప్రభుత్వం కొన్ని షరతులను విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని