Cyber attack: చైనా అతిపెద్ద బ్యాంకు ఐసీబీసీపై సైబర్‌దాడి

Cyber attack: ఐసీబీసీకి చెందిన అమెరికా యూనిట్‌పై హ్యాకర్లు సైబర్‌ దాడికి పాల్పడ్డారు. దీని వల్ల కొన్ని ట్రెజరీ ట్రేడ్‌ లావాదేవీలను కంపెనీ నిలిపివేయాల్సి వచ్చింది.

Published : 10 Nov 2023 12:26 IST

బీజింగ్‌: చైనాకు చెందిన అతిపెద్ద బ్యాంకు ‘ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌ (ICBC)’ అమెరికా యూనిట్‌పై సైబర్‌దాడి జరిగింది. దీంతో ఈ సంస్థ కొన్ని యూఎస్‌ ట్రెజరీ ట్రేడ్‌లను నిర్వహించలేకపోయింది. దాడి ప్రభావం మరింత విస్తరించకుండా కొన్ని వ్యవస్థలను వేరుచేయడం వల్లే ట్రేడ్‌లను నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ వివరించింది. వీటిని తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సెటిల్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ వారంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిపింది.

న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తాజా సైబర్‌దాడిపై విచారణ చేపట్టినట్లు ఐసీబీసీ వెల్లడించింది. అలాగే దర్యాప్తు సంస్థలకూ సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కంపెనీ బ్యాంకింగ్‌, మెయిల్‌ సహా ఇతర ఏ వ్యవస్థలపై దాడి ప్రభావం లేదని స్పష్టం చేసింది. దీనిపై సంస్థ ఇంతకుమించి ఎలాంటి విషయాలను బహిర్గతం చేయలేదు. అయితే, రష్యన్‌ మాట్లాడే ర్యాన్‌సమ్‌వేర్‌ సిండికేట్‌ అయిన లాక్‌బిట్‌ గ్రూప్‌ ఈ దాడి వెనకాల ఉన్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. పాత సోవియట్‌ యూనియన్‌లో లేని దేశాలపై ఈ గ్రూప్‌ సైబర్‌ దాడులకు పాల్పడుతుంటుందని తెలిపాయి. 2019 నుంచి ఇది క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వేలాది సంస్థలపై ఇది సైబర్‌దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని