Ratan Tata: ఛైర్మన్‌ అయిన 15 రోజులకే గ్యాంగ్‌స్టర్‌తో గొడవ.. తొలి సవాల్‌ గురించి చెప్పిన రతన్‌ టాటా

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఎదురైన తొలి సవాల్‌ను పరిష్కరించిన తీరును రతన్‌ టాటా వివరించారు. దీనికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Updated : 21 Aug 2023 12:42 IST

ముంబయి: పారిశ్రామిక, ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata)కు కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న (Udyoga Ratna) అవార్డును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రతన్‌ టాటాకు చెందిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 2013లో కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లో ఓ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆయన, టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. ఓ గ్యాంగ్‌స్టర్‌ తనను చంపేందుకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లినట్లు చెప్పారు. ఆ సమయంలో అతనితో రాజీ పడాలని చాలా మంది తనకు సూచించినా.. ఆ పని చేయలేదని చెప్పారు. 

‘‘టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన 15 రోజులకు నేను ఈ సమస్యను ఎదుర్కొన్నాను. మా సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్‌లో పెద్ద మొత్తంలో సంపద ఉందని భావించిన ఓ గ్యాంగ్‌స్టర్‌, ఎలాగైనా దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. మా సంస్థలో అతడికి 200 మంది అనుచరులు ఉన్నారు. వారితో కంపెనీ కార్యకలాపాలు అడ్డుకోవాలనుకున్నాడు. కానీ, నేను మాత్రం అతడి ఒత్తిడికి తలొగ్గకుండా.. అతడిని ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నాను. నాతో ఉన్నవారు, సంస్థలోని ఉద్యోగులు మాత్రం గ్యాంగ్‌స్టర్‌కు పోలీసుల మద్దతు కూడా ఉండటంతో అతడితో రాజీ పడటం మంచిదని భావించారు. మేం ఊహించినట్లుగానే అతడు మా ప్లాంట్‌ కార్యకలాపాలను అడ్డుకున్నాడు. తన అనుచరులతో సమ్మెకు పిలుపునిచ్చాడు’’ అని రతన్‌ టాటా తెలిపారు. 

తుది దశల్లో జాతీయ ఇ-కామర్స్‌ విధానం

సమ్మె పిలుపుతో కొద్ది మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యేవారని, వారికి అండగా ఉంటానని భరోసానిచ్చేందుకు తాను కూడా రోజంతా ప్లాంట్‌లోనే ఉండేవాడినని రతన్‌ టాటా వివరించారు. దీంతో మిగిలిన ఉద్యోగులు సైతం ప్లాంట్‌కు వచ్చి పనిచేయడం ప్రారంభించారని ఆయన చెప్పారు. అయితే, గ్యాంగ్‌స్టర్‌ మాత్రం ప్లాంట్‌ మూతపడిందని ప్రచారం చేయడంతో, దాన్ని తిప్పికొట్టేందుకు ప్లాంట్ పనిచేస్తుందని, ఉద్యోగులు తిరిగి విధులకు హాజరయ్యారని తెలిసేలా కొన్ని ప్రకటనలు చేయించినట్లు తెలిపారు.

యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదని గ్రహించి, మిగిలిన ఉద్యోగులు కూడా సమ్మెను విరమించడంతో గ్యాంగ్‌స్టర్‌ పథకం బెడిసికొట్టిందని రతన్‌ టాటా చెప్పారు. తర్వాత, గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారని, అతడు జైలు నుంచి విడుదలయ్యాక తనను హత్య చేయించేందుకు ఒప్పందం చేసుకున్నాడని తెలిసి, చాలా మంది అతడితో రాజీ పడాలని సూచించారు. కానీ, తాను మాత్రం ఆ ఒత్తిడికి తలొగ్గకుండా తన పని చేసుకుంటూ వెళ్లిపోయానని రతన్‌ టాటా వీడియోలో వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని