తుది దశల్లో జాతీయ ఇ-కామర్స్‌ విధానం

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న ప్రతిపాదిత జాతీయ ఇ-కామర్స్‌ విధానం తుది దశల్లో ఉందని, వాటాదార్ల అభిప్రాయాల కోసం ప్రస్తుతం కొత్త ముసాయిదాను తీసుకొచ్చే ఆలోచన లేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

Published : 21 Aug 2023 03:37 IST

దిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న ప్రతిపాదిత జాతీయ ఇ-కామర్స్‌ విధానం తుది దశల్లో ఉందని, వాటాదార్ల అభిప్రాయాల కోసం ప్రస్తుతం కొత్త ముసాయిదాను తీసుకొచ్చే ఆలోచన లేదని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిపాదిత విధానంపై ఆగస్టు 2న ఇ-కామర్స్‌ సంస్థలు, దేశీయ వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులతో పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) సమావేశం నిర్వహించింది. కొత్త విధానంపై వాటాదార్ల నుంచి ఏకాభిప్రాయం లభించిందని సమాచారం. దీంతో కొత్త ముసాయిదా ఏమీ విడుదల చేయడం లేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంక్షిప్తంగా

* బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ సన్నీ దేవోల్‌కు చెందిన జుహు విల్లాను ఈ నెల 25న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా రూ.56 కోట్లు రికవరీ చేయాలని బ్యాంక్‌ భావిస్తోంది.

* వచ్చే మూడేళ్లలో 2000 శాఖలు, 2000 ఏటీఎంలకు విస్తరించాలని పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 50 కొత్త శాఖలను తెరవడం ద్వారా 1600 శాఖలకు చేరుతామని బ్యాంక్‌ ఎండీ స్వరూప్‌ కుమార్‌ సాహా తెలిపారు.

* స్థిరాస్తి ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్‌లు) కోసం ఫాలో ఆన్‌ ఆఫర్‌ నిబంధనలను తీసుకురావాలని సెబీ సన్నాహాలు చేస్తోంది.

* ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఆగస్టు 17 మధ్య గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌లో 2.12 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ విక్రయించింది. దీంతో కంపెనీలో వాటా 7.4 శాతం నుంచి 5.28 శాతానికి తగ్గింది.

* వచ్చే నెలలో కూరగాయల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని, ముడిచమురు ధరలు మాత్రం కలవరపెడుతున్నాయని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

* 2023 జూన్‌లో నికరంగా 17.89 లక్షల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో చందాదారులుగా చేరినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని