RBI: దివాలా తీసిన రుణగ్రహీతలపై అడ్డగోలు ఛార్జీలు వద్దు.. ఆర్‌బీఐ మార్గదర్శకాలు

వివిధ కారణాలతో దివాలా తీసిన, రుణ చెల్లింపులు చేయలేని వారిపై భారీగా విధించే అదనపు ఛార్జీల నుంచి ఆర్‌బీఐ విముక్తినివ్వనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో బ్యాంకులు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయకుండా కళ్లెం వేసినట్లైంది.  

Updated : 18 Aug 2023 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాంకులు(banks), న్యాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థ(NBFC)ల వద్ద అప్పులు చేసి ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్‌బీఐ (RBI) కొంత ఊరటనిచ్చింది. ఈ మేరకు తన పరిధిలో పనిచేసే వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర రుణదాతలు లేదా రెగ్యులేటేడ్‌ సంస్థలు (ఆర్‌ఈ) జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ విషయంలో సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని సూచించింది. రుణగ్రహీతలు చెల్లించలేని సమయంలో చాలా సంస్థలు నిబంధనలు ఆసరాగా చేసుకొని జరిమానా వడ్డీ రేట్లను సాధారణంగా కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని పేర్కొంది.

‘‘జరిమానా వడ్డీ లేదా ఛార్జీలను కేవలం రుణ గ్రహీతల్లో క్రమశిక్షణ పెంచడానికి మాత్రమే వినియోగించాలి. అంతేకానీ, అటువంటి వాటిని ముందుగా చేసుకొన్న ఒప్పందం రేటు కంటే మించి ఆదాయం పెంచుకొనే సాధనాలుగా వాడకూడదు. ఈ సంస్థలు విధించే అత్యధిక వడ్డీరేట్లు.. వివాదాలు, ఫిర్యాదులకు దారి తీస్తున్నాయి’’ అని ఆర్‌బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.

‘రియల్‌’ టైటానిక్‌.. రూ.28 లక్షల కోట్ల అప్పులున్న చైనా స్థిరాస్తి దిగ్గజం దివాలా..!

కొత్త మార్గదర్శకాల ప్రకారం రుణ నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతే జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాలి. అంతేకానీ, జరిమానా వడ్డీ ఛార్జీలను విధించకూడదు. దీనిని ఆదాయ మార్గంగా మార్చుకోకూడదు. అంతేకాదు.. ఈ ఛార్జీలపై భవిష్యత్తులో ఎలాంటి వడ్డీని విధించకూడదు. ఇది సాధారణ రుణాలపై విధించే చక్రవడ్డీకి వర్తించదని ఆర్‌బీఐ పేర్కొంది. అంతేకాదు.. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వడ్డీకి మరే ఇతర అదనపు భారాలను జోడించకూడదని ఆర్‌బీఐ తేల్చిచెప్పింది. ఈ మార్గదర్శకాల స్ఫూర్తిని అర్థం చేసుకొని పాటించాలని పేర్కొంది.

ఆర్‌బీఐ పరిధిలోని సంస్థలు జరిమానా వడ్డీ తదితర ఛార్జీల విధానాలను తయారు చేసి ఆమోదించేందుకు ఓ బోర్డు ఏర్పడనుంది. మంజూరు చేసిన రుణాల నిబంధన పరిధిలో జరిమానా ఛార్జీలు సహేతుకంగా ఉండేలా చూడనుంది. వ్యక్తిగత, వ్యాపారేతర రుణాలపై విధించే అపరాధ రుసుములు వ్యక్తిగతేతర రుణాలపై విధించే పీనల్‌ ఛార్జీల కంటే తక్కువగా ఉండాలి. తాజాగా ఆయా సంస్థలు తాము రుణాలు మంజూరు చేసే సమయంలో అపరాధ రుసుముల స్పష్టంగా వెల్లడించాలని ఆర్‌బీఐ చెబుతోంది. అంతేకాదు.. ఆయా సంస్థలు తమ వెబ్‌సైట్లలో వీటిని వడ్డీరేట్లు, సర్వీసు ఛార్జీల విభాగాల్లో ప్రదర్శించాలని చెబుతోంది.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..

రుణ చెల్లింపుల్లు చేయని పక్షంలో రుణగ్రహీతలకు రిమైండర్లు పంపాల్సి ఉంటుంది. చెల్లింపులు చేయకపోతే విధించబోయే పీనల్‌ ఛార్జీలను ముందుగానే రుణగ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. అపరాధ రుసుం విధించిన సందర్భం, కారణం కూడా వివరించాలి. ఈ నిబంధనలు మొత్తం 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు