3 వేల ఎకరాల్లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ కృత్రిమ అడవి

జంతు సంరక్షణ కోసం వంతారా పేరిట రిలయన్స్‌ ఫౌండేషన్‌ కృత్రిమ అడవిని సృష్టించింది. 3వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేసింది. 

Published : 26 Feb 2024 18:07 IST

జామ్‌నగర్‌: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ ​ఫౌండేషన్ జంతు సంరక్షణకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వంతారా పేరిట సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ 3వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు.

వంతారా అనేది ఒక కృత్రిమ అడవి. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటుచేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్​రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇందుకోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) వంటి సంస్థలతో జట్టు కట్టడంపై దృష్టిసారించింది.

ఈసందర్భంగా ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటినుంచే జంతువులను కాపాడడం అభిరుచిగా ఉండేదని, ఆ నిబద్ధతోనే వంతారా అడవిని సృష్టించామని చెప్పారు. భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడమే తమ ఉద్దేశమన్నారు. తమ కృషికి భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించినందుకు సంతోషిస్తున్నామన్నారు. భారత్​ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు కొందరు ఈ మిషన్‌లో భాగంగా ఉన్నారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ, పరిశోధన సంస్థల సహకారాలు, మార్గదర్శకత్వం ఉన్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని