EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..

Electric Vehicles: విద్యుత్‌ వాహనం కొనాలనుకుంటున్నారా? వాటి ప్రయోజనాలే కాదు కొన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయాలూ ఉన్నాయి.

Published : 28 Sep 2023 11:58 IST

Electric Vehicles | ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో విద్యుత్‌ వాహన (Electric Vehicles) విక్రయాలు ఊపందుకుంటున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉండడం, ఈవీల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం ఇందుకు కారణం. ముఖ్యంగా ఎంట్రీ లెవల్‌లో బైక్స్‌, స్కూటర్‌ కొనాలకునేవారు ఈవీల వైపు మళ్లుతున్నారని ఇటీవల బజాజ్‌ సీఈవో రాజీవ్‌ బజాజ్‌ అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు విద్యుత్‌ కార్ల అమ్మకాలూ నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాబోయే పండగల సీజన్‌లో ఈవీల అమ్మకాలు మరింత ఊపందుకోనున్నాయి. ఒకవేళ ఈవీ ఆలోచన మీకూ ఉంటే ప్రయోజనాలే కాదు.. మరికొన్నింటిపైనా లుక్కేయండి..

ప్రయోజనాలు 

  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచించేది వాటి గురించే. ప్రస్తుతం పెట్రోల్‌ లీటర్‌ ధరలు రూ.100కు పైనే ఉన్నాయి. భవిష్యత్‌లో తగ్గే సూచనలూ కనిపించడం లేదు. రోజూ ఎంతోకొంత దూరం ప్రయాణించే వారు ఈవీలైతే తక్కువ ఖర్చుతో ప్రయాణించొచ్చు. నెలంతటికీ కలిపితే రూ.వందల్లో ఆదా అవుతుంది.

  • పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే విద్యుత్‌ వాహనాల మెయింటెనెన్స్‌ తక్కువనే చెప్పాలి. సంప్రదాయ వాహనాలు రిపేర్‌కి వస్తే వేలల్లోనే ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రిక్‌ వాహనాలకైతే అంత ఖర్చవ్వదు.
  • విద్యుత్‌ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎవరైతే ఈవీలను రుణం ద్వారా కొనుగోలు చేస్తారో వారు సెక్షన్‌ 80EEB కింద రూ.1.5 లక్షల వరకు వడ్డీ మొత్తంపై పన్ను రాయితీ పొందొచ్చు. కార్లను కొనే వారికి ఇది అనువుగా ఉంటుంది.

వీటిని దృష్టిలో పెట్టుకోండి..

  • ఒకవేళ మీరు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనం గానీ, కారు గానీ కొనుగోలు చేయాలంటే ముందుగా రేంజ్‌ను దృష్టిలో పెట్టుకోండి. మీ రోజువారీ ప్రయాణానికి వారంలో ఎన్నిసార్లు ఛార్జింగ్‌ పెట్టాల్సి ఉంటుంది? దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. సర్వీసు సెంటర్లూ దగ్గర్లోనే ఉన్నాయా లేదో చూసుకోండి.
  • పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఒకవేళ మీరు నగరాల్లో ఉంటే ఛార్జింగ్‌ విషయంలో బహుశా ఇబ్బంది రాకపోవచ్చు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడప్పుడే ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులోకి రాకపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
  • సాధారణంగా ఈవీలు ఛార్జింగ్‌ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. పైగా మీరు నివాసం ఉండే చోట ఛార్జింగ్‌కు అనువుగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. లేదంటే దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
  • విద్యుత్‌ వాహనాల్లో బ్యాటరీనే కీలకం. ఒకవేళ కొన్నేళ్లు వాడిన తర్వాత బ్యాటరీ పాడైతే మార్పించుకోవడం మినహా ఇంకో ఆప్షన్‌ ఉండదు. ఇప్పుడున్న ధరల ప్రకారం వాహనం ధరలో బ్యాటరీనే దాదాపు సగం ధర ఉంటుంది. ఒక కారు బ్యాటరీ మార్చుకోవాలంటే రూ.4 లక్షలు, టూవీలర్‌ బ్యాటరీ అయితే రూ.50 వేలు వెచ్చించాల్సి ఉంటుంది.
  • చాలా మంది కార్లు, ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వారికి అమ్మే ఉద్దేశం ఉన్నా లేకపోయినా దాని రీసేల్‌ వాల్యూ చూడడం రివాజు. అదే ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో అయితే రీసేల్‌ వాల్యూ గురించి ఆలోచించకపోవడమే మంచిది.

చివరిగా: పై అంశాలేవీ పెద్దగా మీకు ప్రతికూలంగా అనిపించకపోతే ఎంచక్కా ఈవీలు కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే కంపెనీలు వివిధ రకాల ఫీచర్లతో పలు మోడళ్లను లాంచ్‌ చేశాయి. ఇప్పుడిప్పుడే ఈవీల్లోకి పెద్ద పెద్ద కంపెనీలూ ప్రవేశిస్తున్నాయి. త్వరలో మరిన్ని మోడళ్లూ అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని