Sam Altman: మైక్రోసాఫ్ట్‌లోకి శామ్‌ ఆల్ట్‌మన్‌.. స్వయంగా ప్రకటించిన సత్య నాదెళ్ల

Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓగా ఉద్వాసనకు గురైన శామ్‌ ఆల్ట్‌మన్‌ భవిష్యత్‌ కార్యాచరణ ఖరారైంది. ఆయన తమ కంపెనీలో చేరనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించారు.

Updated : 20 Nov 2023 15:23 IST

వాషింగ్టన్‌: ఓపెన్‌ఏఐ నుంచి ఉద్వాసనకు గురైన శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) భవితవ్యానికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సోమవారం కీలక ప్రకటన చేశారు. ఆల్ట్‌మన్‌ తమ కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

వీరిదే నేతృత్వం..

ఆల్ట్‌మన్‌, బ్రాక్‌మన్‌ కలిసి మైక్రోసాఫ్ట్‌ ఏఐ టీమ్‌కు నేతృత్వం వహించనున్నట్లు నాదెళ్ల (Satya Nadella) పేర్కొన్నారు. వారి విజయానికి కావాల్సిన వనరులు సమకూర్చేందుకు తాము వేగంగా చర్యలు చేపడతామని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. దీన్ని ఆల్ట్‌మన్‌ (Sam Altman) కూడా ధ్రువీకరించారు. తమ లక్ష్యం కొనసాగుతుందంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఓపెన్‌ఏఐకి సీఈఓగా ఎమ్మెట్‌ షియర్‌..

మరోవైపు వీడియో స్ట్రీమింగ్ సైట్‌ ట్విచ్‌ సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్‌ షియర్‌ (Emmet Shear)ను కొత్త తాత్కాలిక సీఈఓగా ఓపెన్‌ఏఐ బోర్డు నియమించింది. ఆల్ట్‌మన్‌ను తొలగించిన వెంటనే సీఈఓ బాధ్యతలను మిరా మురాటి స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కూడా ఆల్ట్‌మన్‌కు మద్దతు ప్రకటించడంతో తక్షణమే మరో వ్యక్తిని ఆ పదవిలోకి తీసుకురావడం ఓపెన్‌ఏఐకి అనివార్యమైంది! షియర్‌ ట్విచ్‌కు సీఈఓగానూ వ్యవహరించారు. 2014లో ట్విచ్‌ను అమెజాన్‌ కొనుగోలు చేసింది. 

ఓపెన్‌ఏఐతో భాగస్వామ్యం ఉంటుంది..

షియర్‌ నియామకాన్ని నాదెళ్ల సైతం ధ్రువీకరించారు. ఓపెన్‌ఏఐతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు. సంస్థతో కలిసి తాము రూపొందించిన ప్రోడక్ట్‌ రోడ్‌మ్యాప్‌ ముందుకు సాగుతుందన్నారు. ఓపెన్‌ఏఐ కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద వాటాదారుగా ఉన్న విషయం తెలిసిందే.   

ఆల్ట్‌మన్‌ షరతులకు బోర్డు నో?

తాజా పరిణామాల నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman)ను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు స్పష్టమైంది. తిరిగి రావడానికి సిద్ధంగానే ఉన్నానంటూనే.. ఆయన కొన్ని షరతులు విధించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపిన విషయం విదితమే. దీనికి కొంతమంది బోర్డు సభ్యులు అంగీకరించలేదని.. దీంతో ఆల్ట్‌మన్‌ పునరాగమనానికి దారులు మూసుకుపోయినట్లు సమాచారం.

శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman)ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్‌ఏఐ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఆల్ట్‌మన్‌ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్‌ బ్రాక్‌మన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని